
ఎన్నికల దాకా నడుస్తనే ఉంటది..
లిక్కర్ స్కామ్‌పై కవిత కామెంట్
ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ
చార్జ్‌షీట్‌పై న్యాయ నిపుణులతో చర్చలు
హైదరాబాద్, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ఆమె తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని తన ఇంటి నుంచి ప్రగతి భవన్‌కు బయల్దేరే ముందు అక్కడ ఉన్న మీడియాతో కవిత కాసేపు మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ డైలీ సీరియల్ లాంటిదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ఇది నడుస్తూనే ఉంటుందని అన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని తెలిపారు.
గంటకుపైగా కేసీఆర్, న్యాయనిపుణులతో చర్చలు
సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆమె.. గంటకు పైగా కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిసింది. వీరి భేటీలో న్యాయ నిపుణులు కూడా ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కవిత పేరును ప్రస్తావించడం.. మున్ముందు ఈడీ, సీబీఐ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని, వాటిని ఎలా ఎదుర్కోవాలని న్యాయ నిపుణులతో కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. చార్జ్‌షీట్‌లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా..? గతంలో సీబీఐ విచారణ సందర్భంగా కవిత నుంచి సేకరించిన వివరాలను చార్జ్‌షీట్‌లో ఏమైనా చేర్చారా అని అడిగినట్టు సమాచారం. తర్వాత ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ విందుకు కేసీఆర్ వెళ్లారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ఈ నెల 11 వ తేదీన ఆమె నివాసంలో ప్రశ్నించారు.