కాళేశ్వరంతో యాదాద్రికి చుక్క నీరు రాలే : ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరంతో యాదాద్రికి చుక్క నీరు రాలే : ఎమ్మెల్సీ కవిత
  • ఆలేరు, భువనగిరిలో ఎకరా కూడా తడవలే.. జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ  కవిత ఆరోపణ
  •     నన్ను బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి ఎందుకు తీసేశారో ఎప్పటికైనా చెప్పాల్సిందే 
  •     నాకు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా సస్పెండ్​ చేశారు
  •     నేను ఎవరి బాణాన్ని కాదు.. తెలంగాణ ప్రజల బాణాన్ని 
  •     వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పోటీ చేస్తుందని ప్రకటన

యాదాద్రి, వెలుగు:  కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో యాదాద్రి భువనగిరి జిల్లాకు చుక్కనీరు కూడా రాలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలో 1.55 లక్షల ఎకరాలు, భువనగిరిలో 86 వేల ఎకరాలకు నీరందుతుందని నాడు బీఆర్ఎస్ సర్కారు​ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టులో భాగమైన బస్వాపురం రిజర్వాయర్​ కోసం వేల ఎకరాలు సేకరించారని అన్నారు. 

యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆమె విలేకరులతో మాట్లాడారు.  దేవాదులతో పూర్తిస్థాయిలో సాగునీరు రావడం లేదన్నారు. సాగు నీటి కాల్వ లను ఆంధ్రలో మంచిగా మెయింటెనెన్స్‌‌​ చేస్తార ని, ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.  తనను పార్టీనుంచి సస్పెండ్​ చేసిన బీఆర్‌‌‌‌ఎస్​పై తీవ్ర విమర్శలు చేశారు.  ‘‘నన్ను బీఆర్‌‌‌‌ఎస్​ నుంచి ఎందుకు సస్పెండ్​ చేశారో చెప్పాలి. నేరం నిరూపణ అయిన తర్వాత ఉరి వేస్తారు. 

కానీ పార్టీ ఇంటర్నల్​ వేదికల్లో నన్ను ఏమీ అడగలేదు. నేను చేసిన మిస్టేక్​ ఏంటో చెబితే సమాధానం చెప్పేదాన్ని. కానీ నన్నేం అడగకుండానే సస్పెండ్​ చేసి అవమానించారు. వంద శాతం నా తప్పేమీ లేదు. నేను కూడా కాంప్రమైజ్​ కాకుండా జనం బాట పట్టాను. నా విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కొందరు బీఆర్‌‌‌‌ఎస్​ లీడర్లు అంటున్నారు. నన్ను ఎందుకు సస్పెండ్​ చేశారో.. ఇవ్వాళ కాకుంటే రేపైనా చెప్పాల్సి ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. తాను ఎవరో విసిరిన బాణాన్ని కాదని, తెలంగాణ ప్రజల బాణాన్ని అని కవిత స్పష్టం చేశారు. తనను ఆపరేట్​ చేసేంత సీన్​ ఎవరికీ లేదన్నారు.

 తాను బీఆర్‌‌‌‌ఎస్​లో ఎన్నడూ కీలకంగా లేనని, కనీసం ఒక టీచర్‌‌‌‌ను కూడా ట్రాన్స్‌‌ఫర్​ చేసే శక్తి  తనకు ఉండేది కాదని చెప్పారు. తనను నిజామాబాద్‌‌కే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. కాగా, ట్రిపుల్​ఆర్​ నిర్వాసిత రైతులను అరెస్ట్​ చేయడం తప్పని, ఆనాడు అదే పార్టీలో ఉన్నందున తానుచేయకున్నా.. ఆ పాపంలో తనకు భాగం ఉందన్నారు. అందుకే అరెస్టులపై రైతులకు క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. 

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తా..

రాజకీయంగా నూతన ఒరవడి సృష్టిస్తామని కవిత తెలిపారు. తెలంగాణ జాగృతిని పటిష్టం చేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి కచ్చితంగా పోటీ చేస్తుందని కవిత స్పష్టం చేశారు. రేవంత్‌‌రెడ్డి ఆర్‌‌‌‌ఎస్ఎస్​ సీఎం అని కవిత అన్నారు. ఇంటర్నల్‌‌గా బీజేపీతోనే రేవంత్​ ఉన్నాడని ఆరోపించారు. అదానీ ప్రాజెక్టుల విషయంలో ఆయన ఓపెన్​ డోర్​ పాలసీని అమలు చేస్తున్నాడని విమర్శించారు. 

తనకు దేవుడు అవకాశం ఇస్తే స్వర్ణకారుల నుంచే పుస్తె మట్టెలు కొనాలనే ఫైల్‌‌పై తొలి సంతకం చేస్తానని కవిత తెలిపారు. రాష్ట్రం రావడంలో స్వర్ణకారుల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ముందుగా భువనగిరి ఖిలాను సందర్శించిన అనంతరం స్వర్ణకారులను కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూదాన్​ పోచంపల్లిలో చేనేత కార్మికులను కలుసుకొని, వారితో మాట్లాడారు.