- తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్తున్న
- నిజామాబాద్ నుంచి ‘జాగృతి జనం బాట యాత్ర’ ప్రారంభం
- పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వారికి న్యాయం జరగలే: కవిత
- 1,200 మంది అమరులైతే 580 మందికే గౌరవం దక్కింది
- తెలంగాణ ఉద్యమకారుల్లోనూ వేలాది మందికి అన్యాయం
హైదరాబాద్/నిజామాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని.. వారి త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఏ ఆశయాల కోసం వాళ్లు అమరులయ్యారో.. వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
పేగులు తెగేదాకా కొట్లాడిన ఉద్యమకారుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయాలన్నారు. ఉద్యమంలో 1,200 మంది అమరులైతే 580 మందికే న్యాయం జరిగిందన్నారు. గత పదేండ్లలో మిగతా వాళ్లకు న్యాయం జరగలేదన్నారు. వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నానని కవిత పేర్కొన్నారు. జాగృతి జనం బాట యాత్ర ప్రారంభానికి ముందు ఆమె శనివారం గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ కోసం 1,200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీలో చెప్పాం. కానీ, గత పదేండ్లలో వారికి, వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ, 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేదు. ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ లాంటి అవకాశాలు వచ్చాయి.
ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు. ఇప్పటికీ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఉద్యమం చేస్తున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయినా సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగిన. అప్పుడు అమరవీరుల కుటుంబాలకు ఇంకో రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో చెప్పాను.
కానీ, ఇంకా ఎక్కువగా కొట్లాడాల్సి ఉండే. దీనిపై అమరులు, వాళ్ల కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ చెబుతున్న. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా. ఈ ప్రభుత్వమైనా వారికి కోటి రూపాయలు ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా’’ అని కవిత పేర్కొన్నారు.
ప్రజాదర్బార్ పెట్టుకుని లిస్ట్ చేద్దాం..
ఉద్యమకారుల లిస్ట్‌ను ప్రజాదర్బార్ పెట్టుకుని తయారు చేద్దామని కవిత చెప్పారు. ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చేలా పోరాడుతానని చెప్పారు. జనంబాట యాత్రకు ఉద్యమకారులు కూడా తరలిరావాలని పిలుపునిచ్చారు. అందరం బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు.
కానీ, అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా? అంటే జరగలేదనే చాలా మంది చెబుతున్నారని, అందరు బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలన్నారు. జాగృతి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోందని తెలిపారు. అగ్రవర్ణాల్లో వైశ్యుల జనాభాకు అనుగుణంగా వారికి ప్రాతినిథ్యం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదన్నారు. తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేయటం గుండెల్ని మెలి పెట్టినట్టైందని, మళ్లీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.
నా తొవ్వ వెతుక్కుంటున్న
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని.. ఇరవై ఏండ్లు బీఆర్ఎస్తో కలిసి నడిచినా తగిన గౌరవం, మర్యాద దక్కలేదని కవిత అన్నారు. తండ్రి కేసీఆర్‌పై ఉన్న మర్యాదతో ఇన్నాళ్లు నోరు మెదపకపోయినప్పటికీ.. ఇంటి గుట్టును బయటపడేసి తనను తనను కేసీఆర్ నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం నిజామాబాద్ జిల్లాలో జాగృతి జనం బాట యాత్రను కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా ఆఫీస్ వద్ద ఆమె ప్రసంగించారు. ‘‘ఇన్నాళ్లు కేసీఆర్‌తో ఉన్న నేను ఇప్పుడు నా తొవ్వ వెతుక్కుంటున్న. ఏమి చేయాలో ప్రజలే చెప్పాలె. జిల్లా కోడలిగా వచ్చిన తనకు అండగా నిలబడితే ప్రజల పక్షాన కొట్లాడుతా’’ అని కవిత అన్నారు.
ప్రతి ఉద్యమాన్ని, ప్రతి భావాజాలాన్ని ఆదరించిన నిజామాబాద్ప్రజల వద్దకు తాను వచ్చానని.. ఇప్పుడు నాకు అండగా ఉండాలని కవిత కోరారు. కేసీఆర్ బిడ్డగా ఉద్యమం చేసిన నన్ను.. ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే.. వారి గౌరవం నిలబడేలా పనిచేశానని కవిత అన్నారు.అయితే, రెండో సారి పోటీ చేస్తే.. కుట్ర పన్ని ఓడించారన్నారు.
‘‘రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది జరుగాలని కోరుకుంటున్న. ఆకాశంలో ఎగిరే పక్షినో, అడవిలోని బంగారు లేడీనో కావాలని పేద ప్రజలేమీ గొంతెమ్మ కోరికలు కోరడంలేదు వారి పిల్లలకు తిండి, వైద్యం, చదువు కోరుతున్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉద్యోగం మూలనపడ్డయ్ అని విమర్శించారు.
