రుణమాఫీ చేస్తే ఓర్చుకోలేని కాంగ్రెస్​

రుణమాఫీ చేస్తే ఓర్చుకోలేని కాంగ్రెస్​
  • ప్రతి విషయం వివాదం చేయడం 
  • ప్రతిపక్షాలకు అలవాటైంది  ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, వెలుగు: ఎన్నికల ఎజెండా ప్రకారం రైతు రుణాలు మాఫీ చేస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్​ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రతి విషయాన్ని వివాదం చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. సోమవారం నిజామాబాద్ ​ఐటీ హబ్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. గుప్త నిధుల కోసం సెక్రటేరియేట్​ నిర్మాణం స్టార్ట్​చేశామని అప్పట్లో ప్రచారం చేశారని, ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తుంటే ఆ సంస్థ ఆస్తుల కోసమని, రైతు రుణాలు మాఫీ చేస్తుంటే ఓటు రాజకీయాలని బీజేపీ, కాంగ్రెస్​ కామెంట్​ చేస్తున్నాయన్నారు. 

అదే కామెంట్​సవరించుకొని రుణమాఫీ కాంగ్రెస్​ విజయంగా చెప్పుకుంటూ పూటకో రీతిగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్​ ఏ పని చేసినా బాజాప్తా చెప్పి చేస్తారని, ఇచ్చిన హామీ ప్రకారం రూ.19 వేల కోట్లతో 35 లక్షల మంది రైతు రుణాలు మాఫీ చేస్తున్నారన్నారు. కరోనా ఎఫెక్ట్​తో మాఫీ లేట్​ అయిందన్నారు. 

దివంగత ప్రధాని పీవీపై కృతజ్ఞత ఎక్కడ?

దేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన తరుణంలో తెలంగాణ బిడ్డ, అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు వ్యవస్థను గాడిలో పెట్టారని కవిత అన్నారు. ప్రపంచ పటంలో భారత్​ను గొప్పగా నిలిపిన ఆయనపై కాంగ్రెస్​కు కృతజ్ఞత లేదన్నారు. సోమవారం బ్రాహ్మణ సమాజ్​నగరంలోని బోర్గాం చౌరస్తాలో ఏర్పాటు చేసిన వీపీ విగ్రహాన్ని పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణీదేవీ, కుమారుడు ప్రభాకర్​రావుతో కలిసి ఆవిష్కరించిన కవిత మాట్లాడారు. ఆర్టీసీ చైర్మన్ ​బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్​ విఠల్​రావు, ఎమ్మెల్యే గణేశ్​ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొన్నారు.