కామారెడ్డి/నిజాంసాగర్, వెలుగు : నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో పేరుకుపోయిన పూడికను తీసి, ఆ మట్టిని రైతులకు ఫ్రీగా ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. నిజాంసాగర్ మండలంలో చేపట్టిన నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్‌ను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.
అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. బాన్సువాడలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ కాలేజీని, నాగిరెడ్డిపేట మండలంలో ముంపు బాధిత రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో మట్టి పేరుకుపోవడం వల్ల రిజర్వాయర్ కెపాసిటీ సగానికి పడిపోయిందన్నారు. ప్రాజెక్ట్‌లో పూడికతీతతో పాటు మోడ్రనైజేషన్ పనులు చేపట్టాలని, బ్యాక్‌వాటర్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్‌కు ఇంకా పూర్తి స్థాయిలో భూ సేకరణ జరగలేదన్నారు. డీపీఆర్ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఎత్తిపోతల పనుల విషయంలో అవసరమైతే రైతులతో కలిసి ఇరిగేషన్ మంత్రి ఎదుట ఆందోళనకు దిగుతానన్నారు.
‘నేను మొండిదాన్ని బతుకమ్మ, బోనం ఎత్తుకుంటే దించిందే లేదు.. ప్రజల సమస్యలు కూడా కూడా పరిష్కారం అయ్యే వరకు వదిలేదే లేదు’ అని చెప్పారు. నోటికి ఏదొస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు కనిపించకుండా పోయారని మండిపడ్డారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా మునిగిన పంట లెక్కలు తీసి ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
