
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో తమ ప్రభుత్వం 24 గంటల పాటూ తాగునీళ్లను సరఫరా చేస్తున్నదని, ముంబైలో మాత్రం రోజుకు 2 గంటలే నీళ్లిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ‘‘మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామి అవుతుంది. మహారాష్ట్ర ప్రజల కోసం మేం పనిచేస్తం” అని తెలిపారు. ముంబై పర్యటనలో ఉన్న కవిత శనివారం అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్నదని, తమ రాష్ట్రంతో వెయ్యి కి.మీ.ల సరిహద్దు ఉన్న మహారాష్ట్రలో ఈ చర్చ ఇంకా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ‘‘మా పార్టీని మహారాష్ట్రలో విస్తరించి మంచి పాలన అందించాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నరు. దేశ ప్రజలకు కరెంట్, సాగునీరు లాంటి మౌలిక సదుపాయాలను ఏ పార్టీ ప్రభుత్వమూ కల్పించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వల్ప కాలంలోనే 98 శాతం సదుపాయాలు కల్పించినం. తెలంగాణలో సాధ్యమైన ఈ పనులు దేశ వ్యాప్తంగా ఎందుకు సాధ్యం కావు? ఇదే ఎజెండాతో ప్రజల ముందుకు పోతం. శివాజీ, అంబేద్కర్ సహా ఎందరో మహానుభావుల స్ఫూర్తితో మహారాష్ట్ర అభివృద్ధిలో మా బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం అవుతుంది” అని కవిత వివరించారు.
ప్రజాధనం ఆవిరవుతున్నా స్పందించరా?
‘‘ప్రజలు ఎల్ఐసీలో పెట్టిన పెట్టుబడులు అదానీ కుంభకోణంతో ఆవిరవుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వీడటం లేదు” అని కవిత ట్విట్టర్లో ప్రశ్నించారు. ప్రజల డబ్బులతో ఆటలాడుతున్నారని, ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టిన మధ్య తరగతి ప్రజలకు ప్రధాని మోడీ ఏం సమాధానం చెప్తారని అన్నారు.