
= పార్టీ పెట్టబోతున్నారన్న రఘునందన్
= కాంగ్రెస్ లో చేరుతారంటూ మరో ప్రచారం
= ఎక్స్ లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పోస్ట్
= ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి
= నాన్చుడు ధోరణిలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న ఆమె మీడియా ముందుకు రావడం లేదు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం చెప్పడం లేదు. తనపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్, విమర్శలు, పోస్టులు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. రక రకాల ఊహాగానాలకు తన సోషల్ మీడియాతో సైన్యంతో రిప్లయ్ లు ఇప్పిస్తూ.. పోస్టులు పెట్టిస్తున్నారనే చర్చ కూడా ఉంది.
ఇదిలా ఉండగా నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు మీడియాలో పెను దుమారమే రేపాయి. కవిత పార్టీ పెట్టబోతున్నారని, ఆ పార్టీ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆవిర్భవించబోతోందంటూ కామెంట్ చేశారు. ఆమె పాదయాత్ర చేస్తారని కూడా తెలిపారు. జాగృతి వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవిత.. ఆ సంస్థకు అనుబంధ సంఘాలను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటికే సింగరేణి జాగృతిని ఏర్పాటు చేయగా మరో 30 సంఘాలను ఏర్పాటు చేస్తారని, ఇందుకు గ్రౌండ్ వర్క్ నడుస్తోందనే ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది. దీనిని జాగృతి నాయకులు ఖండించారు. ఇదంతా ఫేక్ ప్రచారమంటూ ట్వీట్లు చేశారు.
►ALSO READ | పెద్దపల్లి పార్లమెంటు పరిధి నేతలతో మీనాక్షి మీటింగ్.. హాజరైన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు
వీటన్నింటిపై స్పందించాల్సిన కవిత తాజాగా హాస్టళ్ల దుస్థితిపై ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల దుస్థితిని ఎండగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలలో కలిపి 1200 మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కవిత ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా చెల్లెలు ట్వీట్ చేసిన 20 నిమిషాలకు అంటే మధ్యాహ్నం 12.30 గంటలకు కేటీఆర్ కాళేశ్వరం రిపోర్టును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.
రేవంత్ ప్రభుత్వం కావాలని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. బయట ఇంత ప్రచారం జరుగుతున్నా.. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలుస్తున్నా.. ఆమె బయటికి రాకపోవడం క్లారిటీ ఇవ్వకపోడం ఏమిటన్నది హాట్ టాపిక్ గా మారింది.