ఇంటికొచ్చి కవితను  విచారించాలి.. అనారోగ్యం కాదు..

ఇంటికొచ్చి కవితను  విచారించాలి.. అనారోగ్యం కాదు..

ఎమ్మెల్సీ కవితను.. ఆమె ఇంటికొచ్చి విచారించాలని.. సీఆర్పీసీ, మనీలాండరింగ్ సెక్షన్ 15 కింద మహిళలను ఇంటికొచ్చి విచారించొచ్చని.. ఆ నిబంధన కిందే ఈడీ అధికారులకు డాక్యుమెంట్లు సమర్పించినట్లు తెలిపారు లాయర్ సోమ భరత్. మార్చి 16వ తేదీని కవిత ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆమె తరపు లాయర్ భరత్.. ఆఫీసుకు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారని.. ఈ విషయంపైనే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశామని.. మార్చి 24వ తేదీ విచారణకు వస్తుందని.. కోర్టు చెప్పినట్లు నడుచుకుంటాం అన్నారు. 

గత విచారణలో ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని.. సెల్ ఫోన్ బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారాయన. మనీలాండరింగ్ కేసులో సెక్షన్ 15 కింద మహిళలు, 15 ఏళ్లలోపు పిల్లలను ఇంటికొచ్చి విచారించాల్సి ఉందని.. అదే విధంగా సాయంత్రం ఆరు గంటలలోపు విచారణ పూర్తి చేయాలని..  గత విచారణలో రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు ఆఫీసులోనే ఉంచుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఈడీ అధికారుల విచారణ తీరు బాగోలేదన్నారు లాయర్. మహిళగా తమకు ఉన్న హక్కులను కవిత ఉపయోగించుకుంటున్నారని.. హక్కులను ఉల్లఘించటాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పుకొచ్చారు లాయర్ సోమ భరత్.

అనారోగ్యంతో విచారణకు హాజరుకాలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు. కవిత తరపున కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులకు సమర్పించామని.. దానికి వాళ్లు ఎకనాడ్జెమెంట్ కూడా ఇచ్చారని వివరించారు. హాజరుకాకపోవటంపై ఏ విధంగా స్పందించలేదని స్పష్టం చేశారాయన. మళ్లీ ఎప్పుడు పిలుస్తారు అనేది దానికి సమాధానం లేదన్నారు లాయర్ భరత్. ఈడీ అధికారులు రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని.. ఆధారాలు లేకుండా కేసుల్లో ఇరికించే కుట్ర చేస్తున్నారన్నారాయన. సుప్రీంకోర్టులో పిటీషన్ పై విచారణ మార్చి 24వ తేదీ జరుగుతుందని.. కోర్టు తీర్పును అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు కవిత లాయర్.