
హైదరాబాద్, వెలుగు: బీసీల నోటికాడి ముద్దను లాక్కోవడానికి కేంద్రంలోని బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయా.. లేదా.. అన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకముందే అందులో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఎలా తెలుసని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీసీలను మోసం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, అన్ని పార్టీల అధ్యక్షులకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్‌లోని జాగృతి ఆఫీసులో తెలంగాణ జాగృతి ఆవిర్భావ వేడుకలు, ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బుధవారం ఆమె నిర్వహించారు.