
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న యువ కవుల సమ్మేళనం నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తాత్వికతను, చారిత్రక నేపథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సౌభ్రాతృత్వాన్ని, సహనశీలతను, సమగ్రతను, సమాజంలో ఉండే సమష్టితత్వాన్ని ప్రతిబింబించేలా యువ కవులు తమ కలాలకు పదును పెట్టాలని కవిత పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే కవులు, కవయిత్రులు 35 ఏండ్ల లోపు వారు అయి ఉండాలి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలలో కవితలు వినిపించవచ్చు. నమోదు చేయించుకోవడానికి కవులు తమ వివరాలతో ఈ నెల 26 లోపు kavitha.telangana@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కవులు కాంచనపల్లి, వనపట్ల సుబ్బయ్య, ఘనపురం దేవేందర్, జాగృతి నాయకులు నవీన్ ఆచారి, శ్రీధర్ రావు, మనోజ్ గౌడ్, లలిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.