
- దేశంలో యుద్ధ వాతావారణం నెలకొంది: ఎమ్మెల్సీ కవిత
- ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమయంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, ఐపీఎల్‌ను వాయిదా వేసినట్టే మిస్ వరల్డ్ పోటీలనూ వాయిదా వేస్తే మంచిదని పేర్కొన్నారు. ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయమని, తప్పుడు సంకేతాలకు తావివ్వరాదని చెప్పారు.
ఆపరేషన్ సిందూర్, ఇండియన్ ఆర్మీకి మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడిలో అమరుడైన సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైన్యానికి ధైర్యం, స్థైర్యం నింపేందుకు గాను ఈ ర్యాలీ చేపట్టామన్నారు.