అక్రమ ఎక్స్ టెన్షన్ హార్డ్ వేర్ పార్క్ను తొలగించాలి : ఎమ్మెల్సీ కోదండరాం

అక్రమ ఎక్స్ టెన్షన్ హార్డ్ వేర్ పార్క్ను తొలగించాలి : ఎమ్మెల్సీ కోదండరాం
  •     టీజీఐఐసీ భూసేకరణ నోటిఫికేషన్​ను రద్దు చేయాలి: ఎమ్మెల్సీ కోదండరాం
  •     రేపు ఆల్ పార్టీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటు చేయెద్దని ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ర్టంలో ఈ పార్క్ ఏర్పాటు కోసం జిల్లాలోని నాదర్ గుల్, ఆదిభట్ల, ఎంఎంకుంట గ్రామాల్లో 3 వేల ఎకరాలు సేకరించారని గుర్తు చేశారు. ఇందులో వ్యవసాయ భూములు, ఇంటి స్ధలాలు ఉన్నాయన్నారు. ఈ అంశంపై ఈనెల 29న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం నాంపల్లి టీజేఎస్ ఆఫీస్ లో  ఆల్ పార్టీ మీటింగ్ పోస్టర్ ను పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దార సత్యంలతో కలిసి ఆవిష్కరించారు. అప్పటి ఆంధ్ర పాలకులు 2004లో జారీ చేసిన హార్డ్ వేర్ పార్కు వర్క్ సెంటర్ నోటిఫికేషన్ కు  ముందే ఈ ప్రాంతంలోని భూముల్లో సుమారు 80 శాతం నివాస స్థలాలుగా అభివృద్ధి చెందాయని తెలిపారు.

ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకోకుండా మొత్తం భూమిని వ్యవసాయానికి పనికిరాని బీడు భూములుగా నమోదు చేసి భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. కొంత భూమిని మాత్రమే సేకరించి, మిగతా భూముల విషయంలో రైతులకు, ఫ్లాట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకున్నారన్నారు. గత 23 సంవత్సరాలుగా ఈ భూములను రెవెన్యూ పహానీలు, ధరణి, భూభారతి రికార్డుల్లో హార్డ్ వేర్ పార్క్ వర్క్ సెంటర్లో భాగంగా చూపిస్తున్నారని, ఇదే అంశాన్ని ఇటీవలి శాసనమండలి సమావేశాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు.