
- చెత్త సేకరణ, తరలింపు బాధ్యతను స్వచ్ఛ కార్మికులకు అప్పగించాలి
హైదరాబాద్ సిటీ/ట్యాంక్ బండ్, వెలుగు: స్వచ్ఛ ఆటో కార్మికులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కోదండరాంకోరారు. రాంకీ సంస్థ చెత్త నిర్వహణ కాంట్రాక్ట్ ను డంపింగ్ యార్డు వరకే పరిమితం చేయాలన్నారు. తరలింపు ప్రక్రియను జీహెచ్ఎంసీ ద్వారా చేపట్టాలన్నారు. ఈ మేరకు శనివారం బల్దియా కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. జీహెచ్ఎంసీ రవాణా విభాగం ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు.
చెత్త నిర్వహణను పూర్తిస్థాయిలో ప్రైవేట్ సంస్థకు అప్పగించవద్దన్నారు. సేకరణ, తరలింపును బల్దియా కార్మికులతో చేపడితే నిర్వహణ సక్రమంగా ఉంటుందన్నారు. కొత్త వాహనాలు కొనే వరకు పాతవాటికి రిపేర్లు చేయించి కొనసాగించాలన్నారు. విధుల్లోకి తీసుకున్న 263 మంది కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు కమిషనర్ అంగీకరించారన్నారు. 160 కొత్త వాహనాలు తీసుకుంటున్నామని తెలిపారన్నారు. కమిషనర్‌ను కలిసిన వారిలో కార్మిక నాయకులు ఆకుల శ్రీనివాస్, గడ్డం జగదీశ్, ఎండీ జహీరుద్ధీన్, పి.భగవంత్ రెడ్డి, జె.డి.కుమార్, ఎం.సురేందర్, బి.బాలరాజు, ఆకుల పద్మ తదితరులు ఉన్నారు.