ప్రభుత్వ బడులు బలోపేతం కావాలి..సర్కారు ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్సీ కోదండరాం

ప్రభుత్వ బడులు బలోపేతం కావాలి..సర్కారు ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్సీ కోదండరాం
  • విద్యలో అసమానతలు ఉండకూడదు: ప్రొఫెసర్ హరగోపాల్
  • తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

ముషీరాబాద్, వెలుగు: ఆత్మగౌరవంతో జీవించడానికి, అసమానతలను రూపుమాపడానికి విద్య అవసరమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణలో పాఠశాలల విద్య, సమస్యలు, సవాళ్లు, సంక్షోభానికి జవాబులు వెతుకుదాం’ అనే అంశంపై మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

దీనికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరై మాట్లాడారు. విద్య అంగడి సరుకుగా మారిందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యపై పెట్టే ఖర్చును పెట్టుబడిగా భావించకుండా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలని కోరారు. యూనివర్సిటీలు కాంట్రాక్ట్ వ్యవస్థలో నడుస్తున్నాయని తెలిపారు. పూలే దంపతులు విద్య కోసం ఎంతో కృషి చేశారని.. అందరూ పూలేగా మారాలని పిలుపునిచ్చారు.

తగినన్ని నిధులు కేటాయించాలి: హరగోపాల్

విద్యకు ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలని  ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. విద్యలో అసమానతలు ఉండకూడదని, అందరికీ ఒకే రకమైన విద్యను అందించాలని కోరారు. జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కన్నెగంటి రవి, మైస శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన బడులను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలు కొన్ని దశాబ్దాలుగా ప్రజల విశ్వాసం కోల్పోయి మూత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన చొరవ చూపకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.