2 వేల జీతంతో ఎట్ల బతుకుతరు?

2 వేల జీతంతో ఎట్ల బతుకుతరు?

హైదరాబాద్ , వెలుగు: ‘నెలకు రెండు వేల జీతంతో ఓ పంచాయతీ కార్మికుడి కుటుంబం ఎలా బతుకుతుంది. రూ.8,500లకు వేతనాన్ని పెంచుతానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైంది? రాష్ట్రంలోని  పంచాయతీ కార్మికులకు, ఏటా రూ.37 కోట్లు ఖర్చు చేయలేరా’ అంటూ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఏడాది క్రితం సీఎం హామీతో కార్మికులు సమ్మె విరమించారని ఆయన గుర్తు చేశారు. పంచాయతీ కార్మికుల్లో 90 శాతం మంది దళితులు, బడుగు, బలహీన వర్గాల వారని చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని నర్సిరెడ్డి అన్నారు. పంచాయతీ కార్మికుల పట్ల వివక్ష తగదని కేసీఆర్ సర్కారుకు హితవు పలికారు. గతంలో సమస్యల పరిష్కారానికి చలో అసెంబ్లీ, చలో సెక్రటేరియట్ కార్యక్రమాలకు పిలుపునిచ్చేవారని, ఇప్పుడు ప్రగతి భవన్ ను ముట్టడించాల్సి వస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు, గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్, ప్రధాన కార్యదర్శి శ్రీపతిరావు, సీఐటీయు నేతలు రమ, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.