మా ప్లాట్లను ఎమ్మెల్సీ పల్లా కబ్జా చేసిండు

మా ప్లాట్లను ఎమ్మెల్సీ  పల్లా  కబ్జా చేసిండు
  • మా ప్లాట్లను ఎమ్మెల్సీ .. పల్లా రాజేశ్వర్‌‌‌‌ రెడ్డి కబ్జా చేసిండు
  • యాదాద్రి జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ నేతల ఆరోపణ 
  • దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌‌ చేయించుకున్నారని ఫైర్‌‌‌‌
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేశారని ఆవేదన

హైదరాబాద్, వెలుగు :  బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌‌‌ రెడ్డి తమ ప్లాట్లను కబ్జా చేసి, దొంగ రిజిస్ట్రేషన్‌‌ పత్రాలు సృష్టించారని యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం నెమురుగొమ్ముల గ్రామానికి చెందిన సాయి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌‌‌‌ స్పందించి, తమ ప్లాట్లు తమకు ఇప్పించాలని, ఆత్మహత్యలే శరణ్యమని వేడుకున్నారు. శుక్రవారం అసోసియేషన్‌‌కు చెందిన సుమారు 15 మంది నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేష్ మాట్లాడుతూ, ‘‘ఎమ్మెల్సీ పల్లా యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలం నెమురుగొమ్ముల గ్రామంలోని 16 ఎకరాల్లో ఉన్న 286 మందికి ప్లాట్లు ఉన్నాయి. ఆయన కొడుకు పల్లా అనురాగ్ రెడ్డి పేరుతో దొంగ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్లాట్ల దగ్గరికి వెళితే గూండాలతో దాడి చేయిస్తున్నారు”అని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం మనిషి అని చర్యలు తీసుకోవడం లేదు..

16 ఎకరాలను 1989లో మహ్మద్ ఖాజా పాషా 200 గజాల ప్లాట్లుగా చేసి అమ్మాడని, అయితే, ఈ ప్లాట్ల పక్కనే అనురాగ్ కాలేజీలు, యూనివర్సిటీ ఉండటంతో వాటిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి కన్ను పడిందని శ్రీనివాస్‌‌ అన్నారు. కాగా, 2002లో చనిపోయిన పాషా.. 2005లో బుచ్చిదాస్ గౌడ్, వినోబా గౌడ్‌‌లకు 8 ఎకరాలు అమ్మినట్లు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వీరు 2007లో మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రావుకు అమ్మారని, ఈ ఇద్దరు 2010లో గాజుల గోవింద రావు అమ్మినట్లుగా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. 

ఆ తర్వాత 2022లో గోవిందరావు.. పల్లా కొడుకు అనురాగ్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని వెంకటేష్ వెల్లడించారు. గాజుల గోవిందరావు అనే వ్యక్తి మం త్రి కేటీఆర్ బామ్మర్దిగా చెప్పుకుంటున్నాడని పేర్కొన్నారు. కబ్జాపై రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసినా పల్లా సీఎం మనిషి అని ఆయన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పల్లా దగ్గర ఉన్న డాక్యుమెంట్లలో సంతకాలు సైతం ఫోర్జరీ అని ఫోరెన్సిక్ రిపోర్ట్‌‌లో తెలిందన్నారు. హైకోర్టు కూడా ఈ ప్లాట్లు తమవే అని తీర్పు ఇచ్చిందని చెప్పారు. ప్రెస్‌‌మీట్‌‌కు వస్తుంటే ఎస్‌‌ఐ ఫోన్ చేసి, మీడియా ముందుకు వెళ్లొద్దని బెదిరిస్తున్నారని వెంకటేష్ తెలిపారు.