
- ఏఐఎఫ్‌టీవో జాతీయ సదస్సులో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దీనికోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం జార్ఖండ్ దేవగఢ్ లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ (ఏఐఎఫ్‌టీవో) జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఓపీఎస్ సాధన కోసం అన్ని రాష్ట్రాల టీచర్లు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
ఏఐఎఫ్‌టీవో బలోపేతానికి పీఆర్‌టీయూఎస్ సంఘం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో టీచర్ల సమస్యల పరిష్కారం కోసం వారిని ఐక్యం చేస్తున్నామని వివరించారు. మారుమూల ప్రాంతాల టీచర్లు సైతం తమ ఇబ్బందులు చెప్పేందుకు వారికి అందుబాటులో ఉండే వ్యవస్థను రూపొందించామని చెప్పారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్ రెడ్డి, ఏఐఎఫ్‌టీవో బాధ్యులు గీత, త్రివేణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.