V6 News

రాజేశ్వరరావు సేవలు మరువలేనివి : ఎమ్మెల్సీ సురభి వాణి

రాజేశ్వరరావు సేవలు మరువలేనివి : ఎమ్మెల్సీ సురభి వాణి
  •     ఎమ్మెల్సీ సురభి వాణి

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట ప్రాంతానికి  ఎమ్మెల్యేగా పనిచేసి విద్యుత్ వెలుగులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయడంతో పాటు విద్యా కాంతులను పంచిన దివంగత ఎమ్మెల్యే పీవీ రాజేశ్వరరావు సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ సురభి వాణి కొనియాడారు. సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పీవీ రాజేశ్వరరావు శత జయంతి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఎంతో  ముందుచూపుతో, దార్శనికతతో రాజేశ్వర రావు చేసిన గొప్ప పనులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. 

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో బూర్గుల రామకృష్ణరావుతో మాట్లాడి అప్పుడు  ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న  సిద్దిపేటకు డిగ్రీ కాలేజీ ఏర్పాటయ్యేలా కృషి చేశారన్నారు. 

ఈ ప్రాంతానికి చెందిన  కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన కాలేజీ మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వాన్ని అందించిందన్నారు.1956లో 36 మంది విద్యార్థులతో ప్రారంభమైన సిద్దిపేట డిగ్రీ కాలేజీ మహోన్నతంగా ఎదిగి  22 యూజీ కోర్సులు, 12 పీజీ కోర్సులతో 4500 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా ఎదిగిందన్నారు.

 కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యుడు ఫారూఖ్ హుస్సేన్,  ప్రిన్సిపాల్ సునీత, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, పాపయ్య, రాఘవేందర్రావు, అయోధ్య రెడ్డి, రాజేశ్వర రావు కుటుంబ సభ్యులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.