మీకు ఇన్నాళ్లకు పీవీ గుర్తుకొచ్చారా?: కాంగ్రెస్​పై ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఫైర్

మీకు ఇన్నాళ్లకు పీవీ గుర్తుకొచ్చారా?: కాంగ్రెస్​పై ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీకి ఇన్నాళ్లకు పీవీ నర్సింహారావు గుర్తుకు వచ్చారా అని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ప్రశ్నించారు. శనివారం ఆమె మేయర్​ గద్వాల విజయలక్ష్మీతో కలిసి తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. చివరి శ్వాస వరకు పీవీ కాంగ్రెస్​ పార్టీ కోసం పని చేశారని గుర్తుచేశారు. మరణాంతరం ఆయనపై ప్రపంచ దేశాలు సానుభూతి చూపించాయని, కాంగ్రెస్​ మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్​ మాత్రమే పీవీకి న్యాయం చేశారన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తికి పీవీ ఘనత తెలియజెప్పేలా శత జయంతి ఉత్సవాలు నిర్వహించారని ప్రశసించారు. కేసీఆర్​ ఉద్యమంతోనే  తెలంగాణ  సిద్ధించిందన్నారు. ఎన్నికల టైం కాబట్టి ఎవరెవరో వచ్చి ఏవేవో మాట్లాడితే నమ్మొద్దని సూచించారు. పీవీపై కడుపులో విషం పెట్టుకొని పైకి మాత్రం ప్రియాంక గాంధీ  తియ్యగా మాట్లాడుతున్నారని మేయర్ ​గద్వాల విజయలక్ష్మీ అన్నారు. పీవీ చనిపోయిన రోజు ఆయన భౌతిక కాయం కూడా కాంగ్రెస్​ ఆఫీస్​లోకి తీసుకురానివ్వలేదని తెలిపారు.