
- 42 శాతం రిజర్వేషన్లపై ఆ పార్టీలది దొంగాట
- బీసీ జేఏసీ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్స్
వరంగల్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుపై మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మూకుమ్మడి కుట్ర చేస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‍ఎస్ ది దొంగాట అని విమర్శించారు. శుక్రవారం ఆయన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ లో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్‍మీట్ నిర్వహించి మాట్లాడారు.
బీసీల రిజర్వేషన్‍పై ఢిల్లీలో మూడు పార్టీలు నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. బీసీ బిల్లుపై ఆమోదం బీజేపీ చేతిలోనే ఉందని సీఎం రేవంత్‍రెడ్డి చెప్పడమంటే.. తాము 42 శాతం ఇవ్వలేమని చెప్పకనే చెబుతున్నాడన్నారు. రాష్ట్రంలో బీసీ కులగణన లెక్కలు తప్పని చెప్పినందుకే తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారన్నారు.
బీసీ రిజర్వేషన్లు చట్టసభల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేది బీసీల ప్రభుత్వమేనన్నారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ కల్పించి న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ నేతలు సూదగాని హరిశంకర్ గౌడ్, వట్టే జానయ్య, నర్సయ్య, రజిని కుమార్, ప్రవీణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.