సంగీత బాహుబలి.. కీరవాణి

సంగీత బాహుబలి.. కీరవాణి

పూసింది పూసింది పున్నాగ అంటూ తీయని రాగాలు పండించారు. అంతా రామమయం అంటూ భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. తెలుసా మనసా అంటూ ప్రేమ భావనతో పులకరింపజేశారు. మౌనంగా ఎదగమంటూ మంచిని సుతిమెత్తగా బోధించారు. జాబిలి ఎక్కడంటూ చుక్కల్నీ చూపుల్నీ అడిగినా.. చలి చంపుతున్న చమక్కులో గిలిగింతలు రేపినా.. అది ఆయనకే చెల్లింది. సప్త స్వరాలతో ఆయన చెలిమి.. సంగీత ప్రియుల మనసుల్ని నింపింది. దాదాపు 3 దశాబ్దాలుగా సంగీత సాగరంలో అందరినీ ఓలలాడిస్తున్న ఆయన మరెవరో కాదు పాటల తోటమాలి.. మరకతమణి కీరవాణి.ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కీరవాణి గురించి కొన్ని విశేషాలు. 

1961 జులై 4న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు కీరవాణి. ఆయన అసలు పేరు కోడూరి మరకతమణి కీరవాణి. వీరిది చాలా టాలెంటెడ్ ఫ్యామిలీ. తండ్రి శివశక్తి దత్తా అద్భుతంగా పెయింటింగ్స్ వేస్తారు. చక్కగా రాస్తారు. ‘బాహుబలి’లోని మమతల తల్లి పాట రాసింది ఆయనే. అలాంటి తండ్రికి పుట్టిన పిల్లలు కూడా టాలెంటెడే అవుతారు కదా. అందుకే కీరవాణి సంగీత స్రష్ట అయ్యారు. ఆయన తమ్ముడు కళ్యాణి మాలిక్ కూడా అన్న బాటలోనే నడిచి సంగీత దర్శకుడయ్యారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌.. కీరవాణికి చిన్నాన్న. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ కూడా కీరవాణికి కజినే. 

అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రస్థానం 

కీరవాణి తన కెరీర్‌‌ను అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా స్టార్ట్ చేశారు. మొదట మలయాళ కంపోజర్ సి.రాజమణి దగ్గర పని చేశారు. తర్వాత చక్రవర్తి దగ్గర కొన్నాళ్లు అసిస్టెంట్‌గా చేరి కలెక్టర్ గారి అబ్బాయి, భారతంలో అర్జునుడు తదితర 60 చిత్రాలకు ఆయనతో కలిసి వర్క్ చేశారు. సాహిత్యంపై కూడా పట్టు సాధించేందుకు వేటూరి సుందర రామ్మూర్తి దగ్గర శిష్యరికం చేశారు. 

మనసు మమతతో పరిచయం

సంగీత దర్శకునిగా కీరవాణి ఫస్ట్ మూవీ ‘కల్కి’. కానీ ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో ఆయన పాటలు మరుగునపడిపోయాయి. అయితే ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి ‘మనసు మమత’ చిత్రానికి పని చేసే ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించింది. దాంతో కీరవాణి మొదటి సినిమా ఇదే అయ్యింది.  దాగుడుమూతల దాంపత్యం, సీతారామయ్య గారి మనవరాలు, జీవన చదరంగం, అత్లింట్లో అద్దె మొగుడు, అమ్మ, పీపుల్స్ ఎన్‌కౌంటర్, మొండి మొగుడు పెంకి పెళ్లాం, అశ్విని అంటూ వరుసగా చాలా సినిమాలకు సంగీతం అందించారు కీరవాణి.

గుర్తింపు తెచ్చిన క్షణక్షణం  

కీరవాణి పాటలకు మంచి పేరొచ్చినా ఆయనకి బ్రేక్ వచ్చింది మాత్రం ‘క్షణక్షణం’ సినిమాతోనే. వెంకటేశ్, శ్రీదేవి జంటగా రామ్‌గోపాల్ వర్మ్ తీసిన ఈ సినిమా సక్సెస్‌లో కీరవాణి సంగీతానికి మేజర్ షేర్ ఉంది. అందుకే ఆయన పేరు మారుమోగింది. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఘరానా మొగుడు, అల్లరి మొగుడు, క్రిమినల్, ఆపద్బాంధవుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, శుభ సంకల్పం, రాంబంటు, ఒకరికి ఒకరు, నేనున్నాను.. ఇలా చాలా సినిమాలపై సంగీతంతో తన ముద్ర వేశారు కీరవాణి. కొన్ని సినిమాలు ఫెయిలైనా, ఆయన పాటలు మాత్రం ఎప్పుడూ ఫెయిలవలేదు. 

రాజమౌళి సినిమాలన్నింటికీ మ్యూజిక్

 కజిన్‌ రాజమౌళితో చేసే ప్రతి సినిమాకీ కీరవాణి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తుంటారు. రాజమౌళి ప్రతి సినిమాకీ సంగీతం అందించేది ఆయనే. స్టూడెంట్ నం 1, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌..  ఇలా ప్రతి మూవీ మ్యూజికల్ హిట్టే. ఇక కీరవాణి ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం దర్శకుడు రాఘవేంద్రరావుతో. వీరి కాంబినేషన్‌లో 27  సినిమాలొచ్చాయి. వాటిలో మ్యాగ్జిమమ్ చిత్రాలు మ్యూజికల్‌ హిట్గా నిలిచాయి. 

ఇతర భాషా చిత్రాలకు సంగీతం

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కీరవాణి వర్క్ చేశారు. ఏ భాషలో చేసినా అక్కడి ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడం కీరవాణి స్పెషాలిటీ. హిందీలో అయితే బెస్ట్ ఆల్బమ్స్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఎం.ఎం.క్రీమ్ పేరుతో అక్కడ అద్భుతమైన పాటలు అందించారు. ఇస్‌ రాత్‌ కీ సుభా నహీ, సుర్, సాయా, జిస్మ్, రోగ్, పహేలీ, జఖ్మ్‌ తదితర చిత్రాల్లోని పాటలు విని బాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

సింగర్గానూ మెప్పించి

ఓవైపు మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేస్తూనే మరోవైపు సింగర్‌‌గానూ ఆకట్టుకున్నారు కీరవాణి. ఆయన మొదటిసారిగా ‘మాతృదేవోభవ’లోని రాలిపోయే పువ్వా అనే పాట పాడారు. తన గురువు వేటూరితో ఈ పాట రాయించుకున్నారు. ఈ పాటకు వేటూరి నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు . ఆ తర్వాత సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, శ్రీరామదాసు, బాహుబలి చిత్రాల్లో తన గళం వినిపించారు. రెహమాన్ సంగీతం అందించిన రోబో 2.ఓ చిత్రంలోని బుల్లిగువ్వ పాటను కీరవాణి పాడటం విశేషం. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ పలు చిత్రాలకు కీరవాణి గాత్రం అందించారు. 

ఎన్నో అవార్డులు

ప్రతిభ ఉన్న వారిని వెతుక్కుంటూ పురస్కారాలు వాటంతటవే వస్తాయి. కీరవాణిని కూడా చాలా అవార్డులు వరించాయి. ‘అన్నమయ్య’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారాయన. రాజేశ్వరి కళ్యాణం, అల్లరి ప్రియుడు, పెళ్లిసందడి, స్టూడెంట్ నం 1, ఒకటో నంబర్ కుర్రాడు, ఛత్రపతి, వెంగమాంబ, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి రెండు భాగాలకుగాను నంది అవార్డులు వరించాయి. ‘అళగన్’ అనే సినిమాకి తమిళనాడు స్టేట్ అవార్డు దక్కింది. రెండుసార్లు సైమా అవార్డ్, ఏడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. 

గీత రచయితగా..

గీత రచయితగానూ కీరవాణి సత్తా చాటారు . ‘వేదం’ సినిమాలో నాలుగు పాటలు రాశారు. ఘరానా మొగుడు, రక్షణ, గంగోత్రి, మేజర్ చంద్రకాంత్, విక్రమార్కుడు వంటి చిత్రాల్లోనూ రచయితగా తన టాలెంట్ చూపించారు. ఇక ‘బాహుబలి 2’లోని దండాలయ్యా పాటకు బెస్ట్ లిరిక్ రైటర్‌‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.

కుటుంబ నేపథ్యం

కీరవాణి భార్య శ్రీవల్లి లైన్‌ ప్రొడ్యూసర్‌‌గా వ్యవహరిస్తున్నారు. వీరి ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు. పెద్ద కొడుకు కాలభైరవ తండ్రి బాటలో పయనిస్తూ  సింగర్‌‌గా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. చిన్న కొడుకు శ్రీసింహా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం కీరవాణి బింబిసార, హరిహర వీరమల్లు చిత్రాలకు వర్క్ చేస్తున్నారు. డ్యూయెట్ నుంచి ఐటమ్ సాంగ్ వరకు.. జోల పాట నుంచి విషాద గీతం వరకు.. ఏ పాట చేసినా అందులో తన మార్క్ చూపించి అందరినీ కట్టి పడేస్తుంది. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పాటలు ఆయన్నుంచి రావాలని కోరుకుంటూ కీరవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు.