
ఘట్ కేసర్, వెలుగు: ఘట్ కేసర్ నుంచి లింగంపల్లికి ఎంఎంటీఎస్రైలు సేవలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సంగారెడ్డి నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ఘట్ కేసర్, ఉప్పల్, మల్కాజిగిరి, మౌలాలి తదితర ప్రాంతాల్లో ఉండే ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, మహిళలకు ఎంఎంటీఎస్సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మౌలాలి, సనత్ నగర్ స్టేషన్ల మధ్య రైల్వే లైన్డబ్లింగ్, కరెంట్ పనులు పూర్తయినట్లు తెలిపారు. రైల్వే డీఆర్ఎం భరతేశ్కుమార్ జైన్, ఏడీఆర్ఎం బసవరాజు తదితరులు పాల్గొన్నారు.