నిమిషానికి 40 లీటర్ల ఆక్సిజన్ ఇచ్చే మొబైల్ ప్లాంట్లు

నిమిషానికి 40 లీటర్ల ఆక్సిజన్ ఇచ్చే మొబైల్ ప్లాంట్లు
  • జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు
  • దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించిన రక్షణ శాఖ
  • వారంలోగా ఆస్పత్రుల వద్ద ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి

న్యూఢిల్లీ: జర్మనీ నుంచి అత్యవసరంగా 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను దిగుమతి చేసుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరగడం, చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతతో పేషెంట్లు చనిపోతుండటంతో కేంద్రం అత్యవసరంగా ఈ  నిర్ణయం తీసుకుందని అధికారులు శనివారం మీడియాకు తెలిపారు. ప్రతి ప్లాంటుకు నిమిషానికి 40 లీటర్ల ఆక్సిజన్, ప్రతి గంటకు 2,400 లీటర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. ‘జర్మనీ నుంచి 23 మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు వారంలోగా విమానాల ద్వారా రవాణా చేయనున్నాం. కరోనా పేషెంట్లకు ట్రీట్​మెంట్ అందిస్తున్న ఆస్పత్రుల్లో వాటిని ఏర్పాటు చేస్తాం. ఈ ప్లాంట్లను ఎక్కడికైనా ఈజీగా తరలించవచ్చు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి భారత్ భూషణ్ బాబు చెప్పారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వైద్య సేవలు పెంచడానికి అత్యవసరమైన ఆర్థిక అధికారాలను ఇస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక ఆక్సిజన్ ప్లాంట్లను తీసుకురావడానికి రవాణా విమానాలను సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే ఇండియన్ ఎయిర్​ఫోర్స్​ను సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశించిందని మరో అధికారి మీడియాకు తెలిపారు.

హర్యానాలో ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్

పానిపట్ నుంచి సిర్సాకు ప్రయాణిస్తున్న లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ శుక్రవారం అదృశ్యం అయింది. జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఆక్సిజన్ పంపండి ప్లీజ్

ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు గంటలకు మాత్రమే సరిపడా ఆక్సిజన్ ఉందంటూ సర్ గంగారాం ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 60 మంది పేషెంట్ల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే స్పందించిన అధికారులు ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించడంతో ఆస్పత్రి వర్గాల  ఊపిరి పీల్చుకున్నాయి. అలాగే, ఆక్సిజన్ కొరత కారణంగా కొత్త పేషెంట్లను చేర్చుకోబోమని, తమ దగ్గర ఉన్న ఆక్సిజన్ కొద్ది గంటలు మాత్రమే సరిపోతుందంటూ సాకేత్​లోని మ్యాక్స్ ఆస్పత్రి వర్గాలు ప్రకటించడంతో అధికారులు స్పందించారు. వెంటనే ఆక్సిజన్ ట్యాంకర్లను ఆస్పత్రికి అందజేశారు.