జనం దగ్గరికే టీకాలు

జనం దగ్గరికే టీకాలు
  • హైదరాబాద్​లో 23 మొబైల్ వ్యాక్సినేషన్ టీమ్స్
  • రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. టీకా కేంద్రాలకు వెళ్లక్కర్లేదు
  • ఆధార్, ఓటర్ ఐడీ చూపించి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు
  • మార్కెట్లు, రద్దీ ఏరియాల్లో తిరుగుతున్న వెహికల్స్
  • రోజూ ఒక్కో వెహికల్ ​ద్వారా 200 మందికి వ్యాక్సిన్

హైదరాబాద్, వెలుగు: వ్యాక్సిన్ వేయించుకునేందుకు హైరానా పడాల్సిన పనిలేదు. రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ టెన్షన్ అవసరం లేదు. టీకా కేంద్రాల చుట్టూ తిరగక్కర్లేదు. హైదరాబాద్​లో మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్లు వచ్చాయి. జనాలు ఉన్న కాడికే పోయి టీకాలు వేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా బాగా రద్దీ ఉన్న ఏరియాల్లో ఈ వెహికల్స్ తిరుగుతున్నాయి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ తీసుకుని వెళ్తే వెయిటింగ్ లేకుండా వెంటనే వ్యాక్సిన్ వేసుకోవచ్చు.

మూడు జోన్లలో తిరుగుతున్న వ్యాన్లు
మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లు.. చార్మినార్, అంబర్ పేట్, సికింద్రాబాద్ జోన్లలో తిరుగుతున్నాయి. మొత్తంగా 23 టీమ్​లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. జీహెచ్ఎంసీ అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. రద్దీ ఏరియాలకు పొద్దున్నే టీం సభ్యులు వెళ్తున్నారు. ఒక్కో మొబైల్‌‌ వ్యాక్సినేషన్‌‌ టీంలో డాక్టర్‌‌, ఫార్మసిస్ట్‌‌, ఏఎన్‌‌ఎం, యూపీహెచ్‌‌ఎంసీ ఏఎన్‌‌ఎంలు ఉంటారు. బార్కస్‌‌, జంగంమెట్, అంబర్‌‌పేట, పానీపురా, గోల్కొండ, నాంపల్లి, అమీర్‌‌పేట, శ్రీరాంనగర్‌‌, సీతాఫల్ మండి, కింగ్ కోఠి, లాలా పేట్ ఏరియాల్లో  తిరుగుతున్నాయి. 

ఒక్కో మొబైల్‌‌ సెంటర్‌‌ ద్వారా రోజుకి 150 నుంచి 200 మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాన్ కనబడగానే వచ్చేస్తున్నరు. ఎక్కువగా పండ్లు, పూల మార్కెట్లు, షాపింగ్ ఏరియాలు, చిరు వ్యాపారులు ఉండే ఏరియాలకు మొబైల్ వ్యాక్సిన్ వెహికల్స్ వెళ్తున్నాయి. రష్ ఎక్కువగా ఉన్న దగ్గర వ్యాన్ ఆపగానే టీకా బాక్స్ లు చూసి జనం వస్తున్నారని అమీర్ పేట్ ఏరియా టీం డాక్టర్ దుర్గ సునీల్ తెలిపారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారి ఆధార్ వివరాలు తీసుకుని యాప్ లో ఎంటర్ చేస్తున్నారు. ఇందుకోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ వ్యాన్ లో ఉంటారు. రిజిస్ట్రేషన్ అయ్యాక వ్యాక్సినేటెడ్ అనే మెసేజ్ సంబంధిత వ్యక్తి మొబైల్ కి పంపిస్తారు. ఎక్కువ టైం తీసుకోకుండా, వెయింటింగ్ లేకుండా నిమిషాల్లో వ్యాక్సిన్ వేసేస్తున్నారు. మొబైల్ వ్యాక్సిన్ టీమ్స్ అన్ని కొవిషీల్డ్ టీకాలను మాత్రమే వేస్తున్నాయి.

10 మందికి చెప్తే.. 20 మంది వస్తున్నరు..
బుధవారం నుంచి మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. అమీర్ పేట్‌‌లో రెండు టీమ్స్​గా విడిపోయి టీకాలిస్తున్నాం. వెహికల్ రాగానే జనాలు వస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఆయా ఏరియాల్లో ఈ డ్రైవ్ గురించి చెప్తారు. 10 మందికి చెప్తే 20 మందికి పైగా వస్తున్నారు. ఈ డ్రైవ్ మరో 3 నెలలు కంటిన్యూ చేస్తే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేయొచ్చు.
- డాక్టర్ దుర్గాసునీల్ వాసా (మొబైల్ వ్యాక్సినేషన్ టీం, అమీర్ పేట్)

వెయిటింగ్ అవసరం లేదు 
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం రానోళ్లకు ఈ మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లు ఉపయోగ పడుతున్నాయి. వెయిటింగ్ అవసరం ఉండదు. ఉదయం 9 గంటల నుంచి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకున్నోళ్ల వివరాలు ఎప్పటికప్పుడు సిస్టంలో ఎంటర్ చేస్తున్నాం.
- డాక్టర్ రాజేశ్వరి (మొబైల్ వ్యాక్సినేషన్ టీం, శ్రీరాంనగర్)