V6 News

ఆగని వానలు... తెలంగాణకు మోచా ముప్పు

ఆగని వానలు... తెలంగాణకు మోచా ముప్పు

తెలంగాణలో గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండు రోజులు( మే 8,9 తేదీలు) వర్షాలు పడనున్నాయి. రాష్ట్రానికి మోచా తుఫాన్ ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడనుందని...  8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతోపాటు మోచా తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మోచా తుఫాన్ కారణంగా తెలంగాణలోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్ లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో చిరు జల్లులు పడతాయని తెలిపింది.  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.  పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిశాయి. 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 30 డిగ్రీల లోపు గరిష్ట, 20 డిగ్రీలపైన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి పూట కాస్త ఎండ ప్రభావం ఉంటుందని, సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం కురుస్తుందని పేర్కొంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి

ఇక గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకారణంగా పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వరి, మెక్కజొన్న నేలకొరిగిపోగా.. నిమ్మ, బత్తాయి, మామిడి వంటి ఉద్యాన వన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతలు కోసి కల్లల్లో ఉన్న ఉన్న ధాన్యం రాశులు కూడా తడిసి ముద్దయ్యాయి. పలు జిల్లాల్లో కల్లల్లోకి నీరు చేరి ధాన్యం నీటి పాలైంది. అప్పులు చేసి మరి పంటలు వేసి, ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేస్తే.. పంట చేతికొచ్చే సమయానికి వరుణడు ప్రతాపం చూపటంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.