- గతంలో లూజ్విత్తనాలు వేయడంతో దెబ్బతిన్న పంటలు
- ఆరేండ్లుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో విస్తరించిన లూజ్పత్తి విత్తనాల మాఫియా
- ఈసారి అగ్రికల్చర్, పోలీస్ డిపార్ట్మెంట్లఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా
మహబూబ్‌నగర్, వెలుగు : పత్తి పంటకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈసారి పత్తి రైతుల చూపు అంతా ప్యాకెట్ విత్తనాల పైనే ఉంది. ఈ సీజన్లో కూడా ఉమ్మడి జిల్లాలో లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో ఏటా సర్టిఫైడ్ చేయని విత్తనాలు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. దాంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పత్తి రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్లో అగ్గువకు దొరికే లూజ్ విత్తనాలు, జర్మినేషన్లో ఫెయిల్ అయిన విత్తనాలను కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫై చేసిన ఆయా సీడ్ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
ఆరేండ్లుగా ఆగం చేస్తున్న ‘లూజ్’ మాఫియా
గతేడాది ఉమ్మడి జిల్లాలో 6.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయ్యింది. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,86,471 ఎకరాల్లో, నారాయణపేటలో 1,60,416, గద్వాలలో 1,55,641, మహబూబ్‌నగర్‌లో 80,534, వనపర్తి జిల్లాలో 2,200 ఎకరాల్లో పత్తి పంటలు సాగయ్యాయి. ఆరేండ్లుగా ఉమ్మడి జిల్లాలో కొందరు పత్తి విత్తన మాఫియా అవతారం ఎత్తారు. బడా లీడర్ల అండతో మండల స్థాయి లీడర్లు ఈ దందాకు తెరలేపారు. సీజన్ ప్రారంభానికి ముందే ఏపీ, కర్నాటక ప్రాంతాల నుంచి లూజ్ విత్తనాలు, జెర్మినేషన్ ఫెయిల్ అయిన విత్తనాలను తెప్పించుకుంటున్నారు. వాటికి లేబుళ్ల అతికించి బహిరంగ మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇందు కోసం చైన్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో అగ్గువకే పత్తి విత్తనాలు దొరుకుతున్నాయని ప్రచారం చేయడం, దిగుబడి బాగా వస్తుందని రైతులను నమ్మించడం చేస్తున్నారు. తీరా ఈ విత్తనాలను కొని విత్తుకుంటున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కలు ఏపుగా పెరిగినా, కాయలు పట్టడం లేదు.
సీజన్ ముగిసే వరకు ఒక్కో పత్తి మొక్కకు 40 నుంచి 50 కాయలు రావాల్సి ఉండగా, ఈ విత్తనాలు వేసిన చేన్లలో పది కాయలకు మించి రావడం లేదు. ఎకరాకు ఐదారు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. దీనికితోడు గత రెండు సీజన్లలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాలకు ఈ విత్తనాలు విత్తుకున్న చేలకు తెగుళ్లు సోకి పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లింది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న రైతులు ఈసారి పత్తి విత్తనాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నారు. కర్నాటక, ఏపీ నుంచి వస్తున్న లూజ్, జర్మినేషన్లో ఫెయిల్ అయిన విత్తనాలను కాకుండా, ప్రభుత్వం సర్టిఫై చేసిన విత్తనాలను కొని, విత్తుకుంటున్నారు.
మాఫియాపై ఆఫీసర్ల స్పెషల్ ఫోకస్..
వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో అగ్రికల్చర్, పోలీస్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో లూజ్, జర్మినేషన్ ఫెయిల్ అయిన విత్తనాలను మార్కెట్లోకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు టాస్క్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఈ బృందాలు దందా చేస్తున్న ముగ్గురిని మహబూబ్‌నగర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పీడీ కేసులు నమోదు చేశారు. అనంతరం వీరిని విచారించగా దాదాపు 55 మందితో కూడిన డీలర్లు, వ్యాపారులు, మధ్యవర్తుల చైన్ లింకును ట్రేస్ చేశారు. వీరందరిని పోలీసులు స్టేషన్లకు పిలిపించి, ఈ విత్తన దందాలో మళ్లీ ప్రారంభిస్తే పీడీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనికితోడు వీరందరిపై ఈ సీజన్లో నిఘా పెట్టారు.
లూజ్ విత్తనాలను అరికట్టాం
మహబూబ్‌నగర్ జిల్లాలో లూజ్ విత్తనాలను దాదాపు అరికట్టాం. వన్, టు పర్సంట్ అక్కడక్కడా కొంత చలామణిలో ఉన్నట్లు సమాచారం ఉంది. దానిపై కూడా నిఘా పెడతాం. గతంలో ఈ దందా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, నిఘా పెట్టాం. వారి నుంచి చైన్ లింక్‌ను ట్రేస్ చేసి, ఈసారి లూజ్ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా అడ్డుకట్ట వేశాం.
-వెంకటేశ్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, మహబూబ్‌నగర్
