- పైలట్ ప్రాజెక్టుగా షురూ.. అక్టోబర్ 29 నుంచే అమల్లోకి
పంజాగుట్ట, వెలుగు : మోడల్ పోలీసింగ్‌లో ఏఐని వినియోగించేందుకు పంజాగుట్ట మోడల్ పోలీస్ స్టేషన్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఫిర్యాదుదారులకు మరింత సులభంగా పోలీస్ సేవలు అందించేందుకు రూపొందించిన ‘సేతు’ యాప్ పనితీరును ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి బుధవారం పరిశీలించారు.
యాప్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న నిర్వాహకులను అడిగి దాని పని విధానం, ఉపయోగాల గురించి తెలుసుకున్నారు. చదువురాని వారు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులకు తెలియజేస్తే ఫిర్యాదు నమోదు చేసుకునేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఫిర్యాదు నమోదు చేసే యంత్రం ముందు నిలబడి తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
అనంతరం యంత్రం టోకెన్‌ను జనరేట్ చేస్తుంది. ఆ తర్వాత సుమారు 30 సెకన్ల వ్యవధిలో ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదు వివరాలను విజువల్‌గా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ రికార్డింగ్ ఆధారంగా అడ్మిన్ ఆఫీసర్‌తో పాటు సెక్టార్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)కు చేరుతుంది. కాగితాల అవసరం లేకుండా ఫిర్యాదులను నమోదు చేసి అధికారులకు చేరవేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని డీసీపీ తెలిపారు.
