ఎన్డీఏకు 335.. మూడోసారీ మోదీనే ప్రధాని

ఎన్డీఏకు  335.. మూడోసారీ మోదీనే ప్రధాని
  • ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో వెల్లడి.. గతంతో పోలిస్తే ఎన్డీఏకు తగ్గనున్న 18 సీట్లు
  • ఇండియా కూటమికి 166, ఇతరులకు 42 సీట్లు
  • తెలంగాణలో కాంగ్రెస్​కు 10, బీజేపీకి 3 స్థానాలు

న్యూఢిల్లీ: రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 335 సీట్లు సాధించి అధికారం నిలబెట్టుకుంటుందని, మూడోసారి కూడా నరేంద్ర మోదీయే ప్రధాన మంత్రి అవుతారని ఇండియా టుడే ‘మూడ్  ఆఫ్ ద నేషన్’ సర్వే పేర్కొంది. బీజేపీ ఊహిస్తున్న ప్రకారం ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వచ్చే అవకాశం లేదని సర్వే వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్డీఏకు 18 సీట్లు తగ్గుతాయని పేర్కొంది. ప్రతిపక్షాల ఇండియా కూటమికి 166 సీట్లు, ఇతరులకు 42 సీట్లు వస్తాయని తెలిపింది. దేశంలోని అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో 2023 డిసెంబర్  15 నుంచి 2024 జనవరి 28 వరకు ఈ సర్వే నిర్వహించారు. 35,801 మందిని ప్రశ్నలు అడిగారు. ఈ సర్వే ప్రకారం పార్టీపరంగా చూస్తే బీజేపీ 304 సీట్లు (గత ఎన్నికల్లో 303 సీట్లు వచ్చాయి) సాధించి సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్  71 సీట్లలో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా ఈసారి కాంగ్రెస్ కు 19 సీట్లు ఎక్కువ వస్తాయి. ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు 168 సీట్లలో గెలుస్తారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ప్రపంచవ్యాప్తంగా భారత్ కు పెరుగుతున్న ఖ్యాతి, నిరుద్యోగం వంటి విషయాలపై ప్రజలను సర్వే చేశారు. 42 శాతం మంది రామ మందిర నిర్మాణానికి మద్దతు ప్రకటించారు. జమ్మూకశ్మీర్ కు ఆర్టికల్  370 రద్దు సరైనదే అని 12 శాతం మంది చెప్పారు. కరోనా వ్యాప్తి కట్టడిలో మోదీ సర్కారు విజయం సాధించిందని 20 శాతం మంది చెప్పారు. అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని 14 శాతం మంది తెలిపారు. కాగా, నిరుద్యోగం విషయంలో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని 18 శాతం మంది తెలిపారు. అలాగే ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కట్టడిలో కేంద్రం ఫెయిల్  అయిందని 19 శాతం మంది వెల్లడించారు.

ఏపీలో టీడీపీకి 17, వైసీపీకి 8

లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి 17, వైసీపీకి 8 సీట్లు వస్తాయని  సర్వే తెలిపింది. టీడీపీ ఓటు శాతం 40 నుంచి 45 శాతానికి పెరుగుతుందని, వైసీపీ ఓటు శాతం 49 నుంచి 41 శాతానికి పడిపోతుందని వివరించింది. ఎన్డీఏ కూటమికి సున్నా సీట్లు వచ్చినా ఓటు శాతం 1 నుంచి 2కు పెరుగుతుందని వెల్లడించింది. ఇండియా కూటమి ఓటు శాతం కూడా 1 నుంచి 3కు పెరుగుతుందని తెలిపింది. ఇతరులకు 9 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. కాగా, తెలంగాణలో మొత్తం 17 సీట్లలో కాంగ్రెస్ కు 10 సీట్లు, బీజేపీకి 3, బీఆర్ఎస్ కు 3, మజ్లిస్  పార్టీకి 1 సీటు వస్తాయని సర్వే వెల్లడించింది.