కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం

కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం

జనగామ : రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై నరేంద్రమోడీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు బీజేపీని గెలిపించేందుకే అమిత్ షా వస్తున్నారని చెప్పారు. ఈ నెల 21న జరిగే సభను విజయవంతం చేయాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఇందుకోసం భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. రాష్ట్రంలో కుటుంబ, నియంతృత్వ పాలన పోవాలని జనం కోరుకుంటున్నారని చెప్పారు.

కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే కేసీఆర్ మిషన్ భగీరథ పథకం తెచ్చారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. రూ. 40వేల కోట్లు ఖర్చు పెట్టినా ఆ పథకం పూర్తికాలేదని, మళ్లీ రూ.30వేల కోట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథకు నిధులివ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి మోడీ సర్కారు ఇచ్చే ఫండ్స్ను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిధుల ఖర్చుపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రధాని మోడీ, అమిత్ షా సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మునుగోడులో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని వివేక్ ధీమా వ్యక్తం చేశారు.