మోదీ ప్రభుత్వం.. దేశాన్ని రాజుల కాలానికి నెట్టాలని భావిస్తోంది: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

మోదీ ప్రభుత్వం.. దేశాన్ని రాజుల కాలానికి నెట్టాలని భావిస్తోంది: రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. దేశాన్ని రాజులు, మహారాజుల కాలానికి తిరిగి తీసుకెళ్లాలనుకుంటున్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కార్మికులకు జీతాల చర్చల హక్కును లాగేసుకోవడం, పంచాయతీల అధికారాన్ని తొలగించడం, రాష్ట్రాల అధికారాన్ని కేంద్రీకరించడం ఉపాధి హామీ చట్టం రద్దు వెనుక ఉన్న అసలు ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఈజీఎస్ కార్మికులతో మాట్లాడిన ఒక వీడియోను శుక్రవారం  రాహుల్​ గాంధీ ఎక్స్‌‌లో పోస్ట్​ చేశారు. 

ఉపాధి హామీ పథకం తమ జీవితాలను మార్చిందని గతంలో చెప్పిన అదే కార్మికులు.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మారుస్తోందని అంటున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈజీఎస్​ను నాశనం చేయాలనే మోదీ ఉద్దేశం వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి? కార్మికుల వేతనాలపై బేరసారాలు చేసే హక్కును లాక్కోవడం. పంచాయతీల అధికారాలను హరించి, వారి చేతులను కట్టేయడం. రాష్ట్రాల అధికారాలను హరించి, అధికారాన్ని ఢిల్లీలో కేంద్రీకరించడం. అధికారం, సంపద మొత్తం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉన్న రాజులు, మహారాజుల కాలానికి దేశాన్ని తిరిగి నెట్టడం” అని రాహుల్​ మండిపడ్డారు. 

ఈజీఎస్​తమకు ఉపాధిని కల్పించడంలో ఎంతో సహాయపడిందని కార్మికులు చెబుతున్నారని.. కానీ, ప్రభుత్వం ఈ పరివర్తనాత్మక కార్యక్రమాన్ని నాశనం చేయాలని భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని.. యూపీఏ హయాంలోని తీసుకొచ్చిన ఈజీఎస్​ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.