మోదీ సర్కారుకు అధికారమే ముఖ్యం : ప్రియాంక గాంధీ

మోదీ సర్కారుకు అధికారమే ముఖ్యం : ప్రియాంక గాంధీ

జైపూర్: మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై కాకుండా అధికారంలో కొనసాగడంపైనే దృష్టి సారిస్తోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేవలం తన పారిశ్రామిక మిత్రుల కోసమే పనిచేస్తోందని మండిపడ్డారు. పేదల జేబులోంచి డబ్బు తీసి బడా పారిశ్రామిక వేత్తలకు ఇవ్వడమే వారి విధానమైందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజస్థాన్‌‌లోని దౌసా జిల్లా సిక్రాయ్‌‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ.. మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.

" బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాజస్థాన్‌‌లో ఎన్ని పథకాలు ప్రవేశపెట్టారు? మోదీ, బీజేపీ దృష్టి మీ క్షేమంపై పెట్టడం లేదు. అధికారంలో కొనసాగడం, వారిని మరింత బలోపేతం చేసుకోవడంపైనే ఉందని స్పష్టమైంది" అని ప్రియాంక అన్నారు. రాజస్థాన్‌‌లో కాంగ్రెస్‌‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. నిజమైన నాయకుడు ప్రజెంట్​, ఫ్యూచర్​ చూస్తాడని, గతం గురించి పదే పదే మాట్లాడడని ఆమె ఇండైరెక్ట్​గా మోదీపై విమర్శలు సందించారు.

సేవ, కరుణతో కూడిన రాజకీయాల ద్వారానే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని, బీజేపీ.. అభివృద్ధి గురించి మాట్లాడకుండా మతం, కుల సమస్యలను ఎందుకు లేవనెత్తుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌‌చార్జ్ సుఖ్‌‌జీందర్ సింగ్ రంధావా, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ సభలో పాల్గొన్నారు. నవంబర్ 25న రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి.