
భారత్ లో మళ్లీ మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బాగుంటుందన్నారు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. మోడీ అధికారంలోకి వస్తేనే ఆ దేశంతో శాంతి చర్చలకు అవకాశాలుంటాయన్నారు. బుధవారం ఆయన ఇస్లామాబాద్ లో విదేశీ జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఇమ్రాన్ ఖాన్. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో సార్వత్రిక ఎన్నికల గురించి కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం భారత్ తో శాంతి చర్చలు కొనసాగుతున్నాయని, వాటికి అడ్డంకులు కలగకుండా ఉండటానికి ఆ దేశంలో మరోసారి మోడీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ అధికారంలోకి రాకపోతే.. సమీప భవిష్యత్తులో భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా కొన్ని సైనిక చర్యలను తీసుకోవడానికి చాలావరకు అవకాశాలు ఉన్నాయన్నారు. పుల్వామా ఘటన తర్వాత మోడీ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు పెరిగిందన్నారు. అలా కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాక్ తో శాంతి చర్చలకు, ఒప్పందం కుదుర్చుకునేందుకు వెనుకాడుతుందని ఆయన తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు,మూడు వారాల వ్యవధిలో భారత్ తమ దేశంపై ఏదైనా ఒక సైనిక చర్యకు దిగుతుందని ఇమ్రాన్ ఖాన్ అంచనా వేశారు.
కాశ్మీర్ అంశం పై భారత్ తో శాంతి చర్చలను కొనసాగించడంలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చని తాను అభిప్రాయపడుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. మోడీ అధికారంలోకి వస్తే.. శాంతి చర్చలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఓ కొలిక్కి వస్తాయన్నారు. భారత్ లో మోడీ అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్ సహా భారత్ లో నివసిస్తోన్న ముస్లింలు అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉందని తాను అనుకోవట్లేదని తెలిపారు. దశాబ్దాల కాలం నుంచీ ముస్లింలు భారత్ లో సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.