
- విద్యా విధానంపై ప్రభుత్వ జోక్యం పరిమితంగా ఉండాలి
- టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ భాగమవ్వాలి
- ఎన్ఈపీతో ఇంటర్నేషనల్ సంస్థల క్యాంపస్‌లు వస్తయి
- ఇండియా నాలెడ్జ్ ఎకానమీగా మారాలి
- గవర్నర్స్ కాన్ఫరెన్స్ లో పీఎం కామెంట్స్
- ఇండియాను నాలెడ్జ్ హబ్ చేసేందుకు కొత్త పాలసీ: కోవింద్
న్యూఢిల్లీ: స్టూడెంట్లపై ఒత్తిడి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘ఫలానా కోర్సులే తీసుకోవాలంటూ స్టూడెంట్లపై ఎలాంటి ప్రెజర్ ఉండకుండా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చాం. ఇప్పుడు మన యువత తమ ఆసక్తులకు అనుగుణంగా చదువుకుంటారు.. నేర్చుకుంటారు’’ అని చెప్పారు. ఎడ్యుకేషన్ పాలసీ అనేది అందరికీ చెందినదని, దానిపై ప్రభుత్వ జోక్యం చాలా తక్కువగా, పరిమితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఇపీ)పై గవర్నర్స్ కాన్ఫరెన్స్ ఇనాగరేషన్ సెషన్లో ప్రధాని మాట్లాడారు. వర్చువల్ మోడ్ లోజరిగిన ఈ మీటింగ్‌లో ఆయా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, వర్సిటీల వీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎడ్యుకేషన్ పాలసీ అందరిదీ
‘‘ఎడ్యుకేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేవి దేశ ఆకాంక్షలను నెరవేర్చడానికి ముఖ్యమైన సాధనాలు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు, అన్నింటికీ విద్యా వ్యవస్థలో రెస్పాన్సిబులిటీ ఉంది. విద్యా విధానంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కూడా నిజం. కానీ సర్కారు ప్రభావం తక్కువగా ఉండాలి. ఫారిన్ పాలసీ, డిఫెన్స్ పాలసీ.. అనేవి ప్రభుత్వానికి చెందినవి కాదు. దేశానికి చెందినవి. అలాగే ఎడ్యుకేషన్ పాలసీ కూడా అందరికీ సంబంధించింది’’ అని కామెంట్ చేశారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రజలను కోరారు.
ఫ్యూచర్ బాగైతది
‘‘చిన్న వయసులోనే ఒకేషనల్ ఎక్స్ పోజర్ వల్ల, మన యువత భవిష్యత్ మెరుగవుతుంది. ప్రాక్టికల్ లెర్నింగ్‌తో గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో వారి భాగస్వామ్యం పెరుగుతుంది. దేశంలో ఉపాధి పెరుగుతుంది’’ అని మోడీ అన్నారు. టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్.. కొత్త విద్యా విధానంలో భాగమైతేనే దానికి సమగ్రత చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త విద్యా విధానం యువతలో జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నింపుతుందన్నారు. లక్షలాది మంది కొత్త విద్యావిధానంపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు చెప్పారు.
ఆశలు, ఆంక్షలు నెరవేర్చేలా..: కోవింద్
ఇండియాను నాలెడ్జ్ హబ్ చేసేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చామని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. కొత్త తరం ఆశలు, ఆంక్షలు నెరవేర్చేలా ఈ పాలసీ ఉండబోతోందని తెలిపారు. 21 వశతాబ్దపు అవసరాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దారన్నారు. 2021లో టీచర్ల ఎడ్యుకేషన్ కోసం కొత్త కరికులమ్ తీసుకొస్తామని చెప్పారు. ‘‘కొత్త విద్యా విధానంపై గవర్నర్లు రాష్ట్రాల్లో వర్చువల్ సమావేశాలు నిర్వహించి ప్రజలు, ఎక్స్ పర్టుల సలహాలు, సూచనల్ని సేకరించాలి. వాటిపై చర్చించి కేంద్ర విద్యా శాఖకు సూచనలు అందజేయాలి’’
అని కోరారు.