- బ్రెజిల్, సౌతాఫ్రికా అధ్యక్షులతో ప్రధాని మోదీ భేటీ
- టెర్రరిజంపై కలిసి పోరాడుదాం
- ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిద్దాం
- ప్రపంచానికి మనం మార్గదర్శకులం అవుదాం
- అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశలు బలంగా వినిపిద్దాం
- పేదరికాన్ని నిర్మూలిద్దామని నేతలకు పిలుపు
జోహన్నెస్‌బర్గ్: యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ) వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ఒక ఆప్షన్ కాదని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యం, అత్యవసరమని నొక్కి చెప్పారు. టెర్రరిజంపై పోరాటానికి సమన్వయంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. టెర్రరిజంలో డబుల్ స్టాండర్డ్స్‌కు స్థానం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని ఖండిస్తామని తేల్చి చెప్పారు. సౌత్ ఆఫ్రికా రాజధాని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సమిట్ సందర్భంగా బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు లూల డిసిల్వా, సిరిల్ రామఫోసాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆశలు, ఆకాంక్షలను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించడంలో ఇబ్సా (ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా) కూటమి కీలక పాత్ర పోషించాలన్నారు.
ప్రపంచం విభజనలు, విభేదాలతో ఉన్నప్పుడు గ్లోబల్ సౌత్‌కు ఇబ్సా మార్గదర్శకంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘‘ఇబ్సా.. ప్రపంచానికి ఐక్యత, సహకారం, మానవత్వ సందేశాన్ని అందిస్తాయి. ప్రపంచం వేగంగా మారుతున్నది. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి మాత్రం పాత పద్ధతుల్లోనే నడుస్తున్నది. గ్లోబల్ గవర్నెన్స్ సంస్థలన్నీ 21వ శతాబ్దం రియాలిటీలకు దూరంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితిని ప్రస్తుత ప్రపంచ వాస్తవాలకు అద్దం పట్టేలా మార్చాలి. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయి. గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి’’ అని మోదీ అన్నారు. ఆఫ్రికా ఖండంలోని దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో
శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కలిసి నేచురల్ ఫార్మింగ్ చేద్దాం
ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలు మిల్లెట్స్ (సామలు), నేచురల్ ఫార్మింగ్, డిజాస్టర్ రెసిలియెన్స్, గ్రీన్ ఎనర్జీ, ట్రెడిషనల్ మెడిసిన్స్, హెల్త్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పరస్పర సహకరించుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి మూడు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో కూడిన ఇబ్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటుకు మోదీ ప్రతిపాదించారు. ఇది యూపీఐ, కోవిన్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్‌సెక్యూరిటీ, విమెన్-లెడ్ టెక్ ఇనిషియేటివ్‌లను షేర్ చేస్తుందని తెలిపారు. ఏఐ మిస్యూజ్ను నిరోధించడానికి గ్లోబల్ కాంపాక్ట్ అవసరమని అన్నారు. 2026, ఇండియాలో నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్‌కు హాజరుకావాలని ఇబ్సా నేతలను కోరారు. ‘ఇబ్సా’ కేవలం 3 దేశాల సమూహం కాదని.. మూడు ఖండాల (ఆసియా, సౌత్ అమెరికా, ఆఫ్రికా) సమూహమని తెలిపారు. మూడు ఖండాల్లోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలను కనెక్ట్ చేసే వేదిక అని చెప్పారు.
