యావత్ ప్రపంచం మనదేశం వైపు చూస్తోంది

యావత్ ప్రపంచం మనదేశం వైపు చూస్తోంది

మండి: హిమాచల్ ప్రదేశ్​లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మళ్లీ అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్​లో బీజేపీని గెలిపించినట్లే హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఓటర్లు కూడా అదే సీన్ రిపీట్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. మండిలో శనివారం నిర్వహించిన ‘బీజేపీ యువ సంకల్ప్ ర్యాలీ’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు. వాస్తవానికి ఆయన ఈ ర్యాలీకి హాజరు కావాల్సి ఉండగా.. వాతావరణం బాగాలేకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ‘‘బీజేపీనే స్థిరమైన ప్రభుత్వాన్ని నడపగలదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే డైరెక్షన్​లో పనిచేస్తదని హిమాచల్ ఓటర్లకు తెలుసు. ఇంతకుముందు దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేవి. కానీ మధ్యలోనే ఆ ప్రభుత్వాలు పడిపోయి సుస్థిర పాలనపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించాయి. కానీ 2014లో కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వం స్థిరమైన పాలన అందిస్తున్నది. విధానాలను, వర్క్ కల్చర్​ను మా ప్రభుత్వం మార్చివేసింది. బలమైన పునాది ఏర్పడడంతో ఇపుడు సాధారణ పౌరుడికి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడింది. అందువల్లే యావత్ ప్రపంచం మనదేశం వైపు చూస్తోంది” అని మోడీ పేర్కొన్నారు.

డ్రోన్ పాలసీని రూపొందించి ఇతర రాష్ట్రాలకు హిమాచల్​ప్రదేశ్ స్పూర్తిగా నిలిచిందని ఆయన కొనియాడారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్​లో పర్యటించి ప్రజలతో ఫేస్ టు ఫేస్​ మాట్లాడతానని మోడీ పేర్కొన్నారు. కాగా, మండి ర్యాలీలో వర్షం పడుతున్నా సభకు హాజరైన జనం కుర్చీలనే గొడుగుల్లా వాడి మోడీ ప్రసంగం విన్నారు. బీజేవైఎం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేల మంది హాజరయ్యారు.