పాకిస్తాన్​కు గాజులు పంపిస్తా : ప్రధాని మోదీ

పాకిస్తాన్​కు గాజులు పంపిస్తా : ప్రధాని మోదీ
  •     వాళ్ల దగ్గర పిండి, కరెంట్.. ఆఖరికి గాజులు కూడా లేవని తెలిసింది : ప్రధాని మోదీ
  •     అణుబాంబులున్నాయని కూటమి నేతలు భయపడుతున్నారు
  •     అలాంటి పిరికిపందలకు దేశాన్ని అప్పగిద్దామా?
  •     బిహార్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ప్రసంగం

పాకిస్తాన్ ​వద్ద వేసుకొనేందుకు గాజులే లేకుంటే తాము గాజులు కొని పంపిస్తామని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పాక్​వద్ద అణుబాంబులున్నాయని ఇండియా కూటమి నాయకులు భయపడుతున్నారని అన్నారు.

పాట్నా: పాకిస్తాన్​వద్ద వేసుకునేందుకు గాజులు లేకుంటే తాము గాజులు కొని తొడిగిస్తామని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పాక్​ వద్ద అణుబాంబులున్నాయని ఇండియా కూటమి నాయకులు భయపడుతున్నారని అన్నారు. వారు పిరికిపందలని, అలాంటి కూటమికి దేశాన్ని అప్పజెప్పుదామా? అని ప్రశ్నించారు. బిహార్​లోని హజీపూర్​, ముజఫర్​పూర్, సరన్​ నియోజకవర్గాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు.

పాక్​ ఆక్రమిత కాశ్మీర్​ను స్వాధీనం చేసుకుంటామని కేంద్రమంత్రి రాజ్​నాథ్ ​సింగ్​ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పాక్​ గాజులేమీ వేసుకోలేదని నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఫరూక్ అబ్దుల్లా ఇటీవల కామెంట్ చేశారు. దీనికి మోదీ కౌంటర్​ ఇచ్చారు. ‘పాకిస్తాన్​లో గోధుమ పిండి లేదు. కరెంట్ ​లేదు. గాజులు కూడా లేవని ఇప్పుడే నాకు తెలిసింది. అయితే, వారికి మనం గాజులు తొడిగిద్దాం’ అని ఫరూక్ అబ్దుల్లాతోపాటు ఇండియా కూటమికి పరోక్షంగా చురకలంటించారు.  

ఇండియా కూటమి గెలిస్తే ఏడాదికో పీఎం

ఇండియా కూటమి కొత్త ఫార్ములా రూపొందించిందని, ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే తమ ఐదుగురి నాయకులకు ఒక్కో ఏడాది ఒక్కొక్కరికి పీఎం పదవిని పంచాలని నిర్ణయించిందని మోదీ అన్నారు. ఇవి దేశ ఆర్థిక స్థితిని మరింత ముందుకు తీసుకుపోయే ఎన్నికలని, ఆలోచించి ఓటేయాలని ప్రజలను కోరారు. ‘ఈడీ దాడులపై ఇండియా కూటమి ఎందుకు అరుస్తుందో నేను మీకు చెప్తాను.

కాంగ్రెస్​ హయాంలో ఈడీ కేవలం రూ. 35 లక్షలు సీజ్​చేసింది. దీన్ని ఓ స్కూల్​ బ్యాగులో తీసుకెళ్లొచ్చు. కానీ, బీజేపీ పాలనలో ఇప్పటివరకూ రూ. 2,200 కోట్ల అక్రమ సంపదను సీజ్​ చేసింది. దీన్ని తరలించాలంటే 70 చిన్న ట్రక్కులు అవసరం’ అని తెలిపారు. ప్రతిపక్ష నాయకులలాగా తనకు వారసులెవరూ లేరని, ప్రజలే తన వారసులని అన్నారు. 

మతపర రిజర్వేషన్లను అంగీకరించను

కాంగ్రెస్​, ఆర్జేడీలాంటి పార్టీలు బుజ్జగింపు రాజకీయాల కోసం ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తాయని మోదీ పునరుద్ఘాటించారు. అయితే, తన కంఠంలో ప్రాణముండగా దీనికి అంగీకరించబోనని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కాంగ్రెస్​కు తాను సవాల్​ విసిరితే.. ఇప్పటికీ స్పందించలేదని మోదీ అన్నారు.

తఖత్​ శ్రీ హరిమందిర్​ జీ పాట్నా సాహిబ్​లో..

బిహార్​ పర్యటనలో భాగంగా తఖత్​ శ్రీ హరిమందిర్​ జీ పాట్నా సాహిబ్​ను ప్రధాని మోదీ సందర్శించారు. తలకు టర్బన్​ చుట్టుకొని దర్బార్​ సాహిబ్​లో ప్రార్థనలు చేశారు. గురుద్వారాలో భక్తులకు లంగర్​ (ఆహారాన్ని) వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ..  సిక్కు గురువుల బోధనలు మనందరికీ స్ఫూర్తినిస్తాయని, మార్గనిర్దేశం చేస్తాయని మోదీ అన్నారు. 

వారణాసిలో మోదీ భారీ రోడ్​షో

ప్రధాని మోదీ తాను పోటీచేస్తున్న యూపీలోని వారణాసిలో భారీ రోడ్​ షో నిర్వహించారు. సంత్​ రవిదాస్​ గేట్, అస్సీ, సోనార్​పుర, జంగంబడి, గొధూలియా మీదుగా కాశీ విశ్వనాథ్​ ధామ్​ వరకు ర్యాలీ సాగింది. అనంతరం కాశీ టెంపుల్​లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు.