12న రామగుండంలో ప్రధాని మోడీ సభ

12న రామగుండంలో ప్రధాని మోడీ సభ
  • 12న రామగుండంలో ప్రధాని మోడీ సభ
  • అదేరోజు ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్​.. 
  • ఏర్పాట్లపై చర్చించిన బీజేపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 12 న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్​ కోసం రానున్నందున అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. సభకు కనీసం లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని నేతలను ఆదేశించింది. ప్రధాని రాక, సభ ఏర్పాట్లపై  శనివారం బీజేపీ  స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. 

ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ మంత్రులు విజయరామారావు, సుద్దాల దేవయ్య, పార్టీ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శులు  ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ , ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్​ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ...ఈ నెల 12 న ప్రధాని రాక సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, దీనికి పెద్ద సంఖ్యలో  రైతులను తరలించాలని కోరారు.  సభ విజయవంతం అయ్యేలా మూడు జిల్లాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. ప్రధానికి భారీ స్వాగతం పలికేలా రాష్ట్రమంతటా వివిధ రూపాల్లో అలంకరణ చేయాలని,  అన్ని నియోజకవర్గాల రైతులు, కార్యకర్తలు సభకు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం కేంద్రం రూ. 6,120 కోట్లు ఖర్చు చేసిందని, దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను జనంలో వివరించాలని పార్టీ నేతలకు తెలిపారు. ఈ ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్​తో తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారత దేశ రైతులందరికీ ఇక నుంచి ఎలాంటి  కొరత లేకుండా ఎరువులను సరఫరా అవుతాయనే విషయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ కేడర్ పై ఉందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదని, అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. ఆ భారం మన దేశ రైతులపై పడకూడదనే ఉద్దేశంతో ఏటా వేలాది కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నదన్నారు.  

మునుగోడులో టీఆర్​ఎస్​ అధికార దుర్వినియోగం: సంజయ్

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బండి సంజయ్​ మండిపడ్డారు. ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు టీఆర్​ఎస్​ లీడర్లు వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశారని, విచ్చలవిడిగా మద్యం ఏరులై పారించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్ కమిషనర్, జిల్లా ఎస్పీ టీఆర్ఎస్ కు తొత్తులుగా మారారని ఆయన ఆరోపించారు. ఏడేండ్లుగా ఒకే పోస్టింగ్​లో ఉన్న పోలీస్ కమిషనర్ ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కార్యకర్తలా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు నమోదు చేశారని,  ఇన్ని అనైతిక చర్యలకు పాల్పడినా మునుగోడు ప్రజలు మాత్రం బీజేపీ వైపే ఉన్నారని, అక్కడ బీజేపీ విజయం ఖాయమని పేర్కొన్నారు.