బీజేపీకి కంచుకోట కాశీ

బీజేపీకి కంచుకోట కాశీ
  • 1991 నుంచి ఏడుసార్లు ఎగిరిన కాషాయ జెండా

  • రెండు దశాబ్దాల్లో 2004లో మాత్రమే కాంగ్రెస్​కు పట్టం

  • 2014 నుంచి మోదీ కంచుకోటగా పవిత్ర నగరం

  • మూడోసారీ ఇక్కడి నుంచే పోటీ

లక్నో: పవిత్ర నగరం వారణాసి బీజేపీకి కంచుకోటగా మారింది. 2004లో మినహా 1991 నుంచి ఇక్కడ వరుసగా కాషాయ జెండానే ఎగురుతున్నది. 2004లో మాత్రం ఇక్కడి ప్రజలు కాంగ్రెస్​కు పట్టం గట్టారు. 2013లో ఢిల్లీలో ఆప్​ సర్కారు కొలువు దీరిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు అర్వింద్​ కేజ్రీవాల్​ 2014  సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో మోదీపై పోటీచేశారు. ఈ పోరులో మోదీ 3 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో కేజ్రీవాల్​పై ఘన విజయం సాధించారు. కేజ్రీవాల్​కూడా రెండు లక్షల ఓట్లు సాధించగలిగారు. ఇక్కడ గెలుపుతో మోదీ ప్రధానమంత్రి పీఠం అధిరోహించగా, వారణాసి ప్రొఫైల్​ మరింత పెరిగింది. అప్పటినుంచి ఈ సిటీ రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఏడుసార్లు బీజేపీ.. ఆరు సార్లు కాంగ్రెస్​

వారణాసి పార్లమెంట్​ నియోజకవర్గం ఐదు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. 1957 నుంచి ఇక్కడ బీజేపీ ఏడుసార్లు విజయం సాధించగా, కాంగ్రెస్​ పార్టీ ఆరుసార్లు గెలిచింది. 2004 మినహా 1991 నుంచి బీజేపీ వరుస విజయాలను నమోదు చేస్తూ వారణాసిని కాషాయ పార్టీ తన అడ్డాగా మార్చేసుకున్నది. ఇక్కడినుంచి గెలిచిన ఇద్దరు నాయకులకు దేశ ప్రధానిగా అవకాశం దక్కింది. 1977 ఎన్నికల్లో వారణాసిలో  47.9% ఓట్ల మెజార్టీతో గెలిచిన చంద్రశేఖర్​ దేశ ప్రధాని అయ్యారు. అనంతరం 2014లో ఇక్కడి నుంచి గెలిచిన నరేంద్ర మోదీకి ప్రధాని అయ్యే గోల్డెన్​ చాన్స్​ దక్కింది. అలాగే, యూపీలో సమాజ్​వాదీ పార్టీ, బహుజన్​ సమాజ్​వాదీ పార్టీలు ఇంతవరకూ గెలవని 11 నియోజకవర్గాల్లో వారణాసి కూడా ఒకటి కావడం గమనార్హం.  

2014లో మోదీ పోటీకి బలమైన కారణం

మోదీకంటే ముందు ఈ నియోజకవర్గ సీటు సీనియర్​ నేత మురళీమనోహర్​ జోషిది. అయితే, 2014లో కాంగ్రెస్​ను నిలువరించి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 80 లోక్​సభ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్​లో మెజారిటీ సీట్లను గెల్చుకోవాల్సిన పరిస్థితి.. దీంతో ఇక్కడ పట్టుసాధిస్తే సరిహద్దుల్లోని 40 ఎంపీ స్థానాలున్న బిహార్​లోనూ కలిసొస్తుందనే బలమైన విశ్వాసంతో బీజేపీ.. హిందూ ఓటుబ్యాంకు అధికంగా ఉన్న వారణాసి నుంచి మోదీని రంగంలోకి దింపింది. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఇక్కడినుంచే బరిలో నిలిచి, సమాజ్​వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్​పై 4.7 లక్షల ఓట్లతో ఘన విజయం సాధించారు. రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించారు. 

 2024 ఎన్నికల్లోనూ మోదీ ఇక్కడినుంచే పోటీ!

మోదీ ముచ్చటగా మూడోసారి కూడా ఇక్కడి నుంచే బరిలో నిలుస్తున్నారని తెలుస్తున్నది. ఈ విషయంపై బీజేపీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వారణాసి లోక్ సభ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్​నుంచి వరుసగా మూడోసారి అజయ్​రాయ్​ బరిలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో అజయ్​ రాయ్​ మూడోస్థానంలో నిలిచారు.

75% మంది హిందువులే

వారణాసి పార్లమెంట్​ నియోజకవర్గంలో 19.62 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో 10.65 లక్షల మంది పురుషులు కాగా, 8.97లక్షల మంది మహిళలు. 135 మంది ఇతరులు ఉన్నారు. కాగా, ఈ నియోజకవర్గ జనాభాలో 75% మంది హిందువులే. 20% మంది ముస్లింలు, 5% మంది ఇతర మతస్థులు ఉన్నారు.ఈ నియోజకవర్గంలో హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో బీజేపీకి ఓట్లశాతం పెరుగుతూ వస్తున్నది.