గవర్నరెన్ని చెప్పినా.. కేసీఆర్ చెప్పిందే మోడీ వింటడు

గవర్నరెన్ని చెప్పినా.. కేసీఆర్ చెప్పిందే మోడీ వింటడు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గవర్నర్ ఎన్ని చెప్పినా..  చివరకు ఆయన వినేది కేసీఆర్ మాటలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  మోడీ ,అమిత్ షా కేసీఆర్ చేతిలో ఉన్నారని ఆయన చెప్పారు.  గురువారం ఉదయం మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 8 ప్రకారం జంట నగరాలలో గవర్నర్ కు సర్వాధికారాలు ఉన్నాయన్నారు.  అవసరమైతే పరిపాలనను కూడా చేతిలోకి తీసుకోవచ్చని కామెంట్ చేశారు.  ‘‘ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసే ఉన్నాయి.  వాళ్లది అత్తా కోడళ్ల పంచాయతీ. తెలంగాణ రాష్ట్రం ఎఫ్ఆర్బీఎం పరిమితి కి మించి అప్పులు చేసిందన్న బీజేపీ.. రూ.4వేల కోట్ల అప్పు ఎలా ఇచ్చింది?  జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మోడీ చెప్పినట్లు కేసీఆర్ వింటాడు. కేసీఆర్ సొంత అభ్యర్థిని పెట్టి రాష్ట్రపతి ఎన్నికలకు పోతేనే మోడీని వ్యతిరేకించినట్లు’’ అని రేవంత్ పేర్కొన్నారు.  

క్రియాశీలక ప్రభుత్వం లేదు..

‘‘కేసీఆర్ కు అధికారంతో పాటు బాధ్యత ఉంటుంది.. బాధ్యత తీసుకున్నప్పుడు, రాజ్యాంగం తన పని తాను చేసుకుపోతుంది’’ అని  ఆయన తెలిపారు. రాష్ట్రంలో  క్రియాశీలక ప్రభుత్వం లేదని..  ప్రజలు క్రియాశీలక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.  మహిళలపై  అఘాయిత్యాలు జరుగుతున్నా,  తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.   కేసీఆర్ కు నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా అనేలా రాష్ట్రంలో  పరిస్థితి ఉందన్నారు.  జూబ్లీహిల్స్ బాలిక కేసు లో గుర్తించిన వాహనాల యజమానులకు శిక్షలు పడాలని డిమాండ్ చేశారు.  టీఆర్ఎస్, ఎంఐఎంలు పాలనలోనే కాకుండా.. రేప్ లు కూడా పొత్తులనే చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. బాలిక రేప్ కేసు లో పాత్రధారి అయిన వక్ఫ్ బోర్డు చైర్మన్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకొచ్చారో ? 

‘‘ కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మాత్రమే ప్రకటనలు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా యాడ్స్ ఇవ్వాలంటే.. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోండి. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి ? వచ్చే మా ప్రభుత్వం లో యాడ్స్ పై సమీక్ష చేస్తాం’’ అని రేవంత్ స్పష్టం చేశారు. ‘‘ నేషనల్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు తొలగించిందే కేసీఆర్. ఇప్పుడు వర్ధంతి, జయంతి ల సందర్భంగా  ఎన్టీఆర్ కు పూలదండలు  వేస్తే .. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ఎన్టీఆర్ అభిమానులు మర్చిపోతారా ?   ఇప్పుడు కేసీఆర్ కు ఎన్టీఆర్ ఎందుకు గుర్తుకొచ్చారో ? ’’ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎవరి కోసమూ ఆగవని, తాను లేకున్నా చింతన్ శిబిర్ జరిగిందని గుర్తుచేశారు.