వీడియో: ఒక్కసారి మణిపూర్‌ రండి.. కన్నీళ్లతో మోడీని వేడుకున్న చాంపియన్‌

వీడియో: ఒక్కసారి మణిపూర్‌ రండి.. కన్నీళ్లతో మోడీని వేడుకున్న చాంపియన్‌

గతేడాది షెడ్యూల్ తెగల (ST) హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ తలపెట్టిన "గిరిజన సంఘీభావ మార్చ్" హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ నిరసనల అనంతరం మెయిటీలకు, వ్యతిరేక వర్గానికి మధ్య జరిగిన దాడుల్లో దాదాపు 180 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి నుంచి హింస అలానే కొనసాగుతోంది. బయటకి వెళ్లిన వారు ఇంటికి సురక్షితంగా చేరుకుంటారో లేదో తెలియని పరిస్థితి. పిల్లలకు స్కూళ్లు లేవు, చదువులు లేవు. ప్రజలు నీళ్లు, తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న పరిణామాలపై వేదికపైనే ఓ క్రీడాకారుడు వేదికపైనే తన బాధను వెళ్లబోసుకున్నాడు. చొరవ తీసుకోవాలని దేశ ప్రధానిని అభ్యర్థించాడు.

మణిపూర్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్‌ ఫైటర్‌ చంగరెంజ్‌ కొరెన్‌ మాట్రిక్స్‌ ఫైట్‌ నైట్‌ (ఎంఎఫ్‌ఎన్‌) ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. అయితే, ఆ ఆనందాన్ని మాత్రం అతడు ఆస్వాదించలేకపోయాడు. తన రాష్ట్రం మణిపూర్‌లో ఉన్న పరిస్థితులను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏడాది కాలంగా మంటల్లో తగలబడుతోన్న తన(మణిపూర్) రాష్ట్రాన్ని సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోడీకి అతడు వినయపూర్వకమైన అభ్యర్థన చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మోడీజీ ఒక్కసారి రండి..

"ఇది నా వినయపూర్వకమైన అభ్యర్థన మోడీజీ.. దయచేసి ఒకసారి మణిపూర్ ను సందర్శించండి. ఏడాది కాలంగా మణిపూర్ మంటల్లో కాలిపోతుంది. అమాయక ప్రజలు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు. పిల్లలకు స్కూళ్లు లేవు, చదువులు లేవు.  సహాయక శిబిరాల్లో తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. భవిష్యత్తు అస్పష్టంగా ఉంది. మోదీ జీ, దయచేసి మణిపూర్‌ని ఒకసారి సందర్శించి రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించండి.." అని చంగరెంజ్‌ కొరెన్‌ రోదించాడు.