భయపెట్టుడే మోదీ ఎజెండా.. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐతో దాడులు

భయపెట్టుడే మోదీ ఎజెండా.. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐతో దాడులు
  •  పదేండ్లుగా రాజ్యాంగంపై దాడి చేస్తున్నరు
  • నేనూ ఎన్డీఏ సర్కార్ బాధితుడినే..
  • నా పై 20 కేసులు పెట్టి.. ఇల్లు గుంజుకున్నరు
  • హింసను ప్రేరేపించేవాళ్లు హిందువులు ఎట్లయితరు?
  • శివుని చేతిలో త్రిశూలం అహింసకు ప్రతీక
  • మతం పేరుతో బీజేపీ అందరినీ భయపెడ్తున్నది
  • హిందూ సమాజమంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోదీ మాత్రమే కాదు
  • గుజరాత్​లో మోదీని ఓడించి తీరుతాం
  • లోక్​సభలో బీజేపీపై ప్రతిపక్ష నేత ఫైర్
  • రాహుల్ కామెంట్లపై ప్రధాని మోదీ అభ్యంతరం
  • హిందువులను అవమానించారని ఆగ్రహం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. అవినీతిపై ఎవరు నిలదీసినా.. వాళ్లను దర్యాప్తు ఏజెన్సీలతో భయపెట్టుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎజెండా అని కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. పదేండ్లుగా రాజ్యాంగం, దేశ విలువలపై ఓ క్రమపద్ధతిలో దాడి చేస్తూ వస్తున్నారని ఫైర్ అయ్యారు. సొంత పార్టీ ఎంపీలను కూడా మోదీ వదల్లేదని ఆరోపించారు. వారిపై కూడా నిఘా పెట్టారని విమర్శించారు. అపోజిషన్ పార్టీ లీడర్లపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయించారన్నారు. 

‘‘కొంత మంది లీడర్లు ఇప్పటికీ జైల్లోనే ఉన్నరు. నేనూ ఎన్డీయే సర్కార్ బాధితుడినే. నాపై కూడా 20కిపైగా కేసులు పెట్టారు. రెండేండ్ల జైలుశిక్ష పడింది. నా ఇల్లు గుంజుకున్నరు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న’’అని రాహుల్ అన్నారు. 

 రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా సోమవారం లోక్​సభలో రాహుల్ మాట్లాడారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో అంబానీ, అదానీల సంపద పెంచారని ఆరోపించారు. చిన్న, మధ్య తరహా వ్యాపారుల నడ్డి విరిచారని ఫైర్ అయ్యారు. గుజరాత్ లోని టెక్స్​టైల్ వ్యాపారులు కూడా ఇదే చెప్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్ లో బీజేపీని ఓడించి తీరుతామని.. ఇది రాసిపెట్టుకోవాలని సవాల్ విసిరారు.

అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్నరు

ఇస్లాం, క్రిస్టియన్, బౌద్ధ, జైన, సిక్కు మతాలన్నీ ధైర్యం, నిర్భయత గురించి మాట్లాడుతాయని రాహుల్ అన్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం హిందూ మతం పేరుతో భయం, ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. ‘‘అహింస, భయాన్ని వీడాలని మన పూర్వీకులు, ఎంతో మంది మహానుభావులు చెప్పారు. కొందరు మాత్రం తాము హిందువులమని చెప్పుకుంటూ హింస గురించి మాత్రమే మాట్లాడుతారు. ద్వేషం, అబద్ధాలను స్ప్రెడ్ చేస్తారు. ఇలాంటి వారు హిందువులు ఎలా అవుతారు?’’అని రాహుల్ అన్నారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైందని, ఇందులో ‘సత్యం’ ఉంది అని అన్నారు.

రాహుల్ వర్సెస్ నరేంద్ర మోదీ

హిందువులను ఉద్దేశిస్తూ రాహుల్ చేసిన కామెంట్లపై ప్రధాని మోదీ వెంటనే లేచి అభ్యంతరం తెలిపారు. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకొని.. ఈ విషయం ఎంతో తీవ్రమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజాన్ని హింసాత్మకమని పేర్కొనడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని మండిపడ్డారు. అందుకు రాహుల్ బదులిస్తూ.. ‘‘నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదు. అలాగే.. ఆర్ఎస్ఎస్ ఒక్కటే హిందూ సమాజం కాదు. నేను కేవలం ప్రధాని మోదీని, బీజేపీని, ఆర్ఎస్ఎస్‌‌‌‌ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశాను. మొత్తం హిందూ సమాజాన్ని ఉద్దేశించి కాదన్న విషయం తెలుసుకోవాలి’’అంటూ మోదీకి రాహుల్ రిప్లై ఇచ్చారు.

దేవుడు చెప్తేనే పెద్దనోట్లు రద్దు చేశారా? 

ప్రజలకు సేవ చేసేందుకు తనను దేవుడే పంపాడని గతంలో మోదీ చేసిన కామెంట్లపై రాహుల్ వ్యంగ్యంగా స్పందించారు. ‘‘నేను అసాధారణ వ్యక్తిని.. నాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది”అంటూ మీడియాతో మోదీనే అన్నారు. పెద్దనోట్ల రద్దు చేయమని దేవుడు చెప్తేనే.. ఈయన చేసినట్టు ఉన్నారు. ముంబై ఎయిర్​పోర్టు అదానీకి ఇచ్చెయ్ అని దేవుడు చెప్పిండు.. మోదీ ఇచ్చేసిండు. దేవుడు నుంచి ఏం మెసేజ్ వస్తే అది మోదీ వెంట వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయారు. పరమాత్మ.. డైరెక్ట్​గా మోదీ ఆత్మతో మాట్లాడుతుంది. మనమంతా సాధారణ మనుషులం. అందరి మాదిరి పుట్టి.. చనిపోయే జీవులం’’అని రాహుల్ సెటైర్ వేశారు.

మోదీ జీ.. కొద్దిగా నవ్వండి ప్లీజ్..

హిందూ సమాజం వ్యాఖ్యలపై సభలో వాడీవేడిగా చర్చ జరుగుతున్నప్పుడు.. మోదీ సీరియస్​గా రాహుల్ వైపు చూస్తున్నారు. మోదీని రాహుల్ చూస్తూ.. ‘‘మోదీ జీ.. మీరు ఎప్పుడూ సీరియస్​గానే ఉంటారా? నవ్వరా? మీరు సభాపక్ష నేత.. ప్రతిపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన సందర్భాల్లేవు. కనీసం మేము ఎదురుపడినప్పుడు మీ ఫేస్​పై నవ్వు ఉండదు. దీనికి కారణం ఏంటి?’’అని ప్రధానిని రాహుల్ ప్రశ్నించారు. దీనికి మోదీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రతిపక్ష నేతను సీరియస్‌‌‌‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయి’’ అంటూ కామెంట్ చేశారు. దీంతో ఎన్డీఏ సభ్యులంతా ఒక్కసారిగా నవ్వారు.

శివుని ఎడమ చేతిలోనే త్రిశూలం ఎందుకంటే..

సభలో శివుని ఫొటో చూపిస్తూ రాహుల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. శివుని ఎడమ చేతి వెనుక ఉన్న త్రిశూలం హింసకు గుర్తు కాదని అన్నారు. హింసకే అయితే.. త్రిశూలం కుడి చేతిలో ఉండేదని వ్యాఖ్యానించారు. తాను శివుని నుంచే ప్రేరణ పొందానని తెలిపారు. సభలో దేవుళ్ల ఫొటోలు ప్రదర్శించడంపై బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు రూల్స్‌‌‌‌ ఒప్పుకోవని స్పీకర్‌‌‌‌ ఓం బిర్లా రాహుల్​కు చెప్పారు. సభలో శివుని బొమ్మని చూపించడం నిషేధమా? అని రాహుల్ ప్రశ్నించారు. తన మెడకు పాము చుట్టిముట్టినప్పుడు తాను వాస్తవాన్ని అంగీకరిస్తానని శివుడే చెప్పాడని గుర్తు చేశారు. ఆయన చేతిలో ఉన్న త్రిశూలం అహింసకు ప్రతీక అని వివరించారు.

రాహుల్ నేతృత్వంలో నిరసన

అపోజిషన్ పార్టీ నేతలే లక్ష్యంగా దర్యాప్తు ఏజెన్సీలతో మోదీ దాడులు చేయిస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆప్, టీఎంసీతో పాటు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు. దర్యాప్తు ఏజెన్సీల అధికారాలను మిస్ యూజ్ చేయొద్దంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని మండిపడ్డారు. వెస్ట్ బెంగాల్​లో ముగ్గురు మంత్రులను అరెస్ట్ చేయించారన్నారు. తేజస్వీ యాదవ్​పై ఈడీని ఉసిగొల్పారని మండిపడ్డారు. హేమంత్ సోరెన్, అర్వింద్ కేజ్రీవాల్​ను జైలు పాలు చేశారన్నారు.

మోదీకి వంగి.. వంగి షేక్ హ్యాండ్ ఇచ్చారు

సభలో మైకులు ఎవరి నియంత్రణలో ఉంటాయని స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ ప్రశ్నించారు. తాను మాట్లాడుతుంటే మైక్‌‌‌‌ కట్‌‌‌‌ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్‌‌‌‌ ఓంబిర్లా స్పందిస్తూ.. అలాంటిదేమీ జరగలేదని వివరణ ఇచ్చారు. స్పీకర్‌‌‌‌ వ్యవహారశైలిని కూడా రాహుల్ తప్పుబట్టారు. ‘‘సభ ఫస్ట్ డే.. ప్రధాని మోదీ షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇచ్చినప్పుడు స్పీకర్‌‌‌‌ తలవంచారు. నేను షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇస్తే నిటారుగా నిల్చున్నరు’’అని అనగా.. స్పీకర్ స్పందిస్తూ.. ‘‘నా కంటే వయసులో మోదీ పెద్దవారైనందునే తలవంచాను. నేను సంప్రదాయాలను గౌరవిస్తాను’’అని స్పీకర్‌‌‌‌ వివరణ ఇచ్చారు.

మోదీ ఒక్కరే హిందూ సమాజం కాదు

హిందూ మతం అంటే.. భయం, ద్వేషం, అబద్ధాలు వ్యాపింపజేయడం కాదని రాహుల్ గాంధీ అన్నారు. హిందూ విలువలను బీజేపీ కాలరాస్తున్నదని మండిపడ్డారు. హిందూ మతం పేరు చెప్పి ఆ పార్టీ అందరినీ భయపెడ్తున్నదని ఆరోపించారు. రాజ్యాంగ ప్రతులు, శివుడు, మహ్మద్ ప్రవక్త, జీసస్, గురునానక్ ఫొటోలు చూపుతూ లోక్​సభలో బీజేపీపై రాహుల్ ఫైర్ అయ్యారు. తమని తాము హిందువులమని ప్రచారం చేసుకునేవారు విద్వేషాలను రెచ్చగొడ్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. 

అలాంటి వాళ్లు అసలు హిందువులే కారని విమర్శించారు. అసలు హింసని ప్రేరేపించే వాళ్లను హిందువులని ఎలా అనగలమని ప్రశ్నించారు. రాహుల్ మాట్లాడుతున్నప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల్గజేసుకున్నారు. రాహుల్ కామెంట్లపై అభ్యంతరం తెలిపారు. యావత్ హిందూ సమాజాన్ని రాహుల్ అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. నరేంద్ర మోదీ ఒక్కరే మొత్తం హిందూ సమాజం కాదన్నారు. తాను ఎక్కడా హిందూ సమాజం గురించి తప్పుగా మాట్లాడలేదని తెలిపారు. బీజేపీ నేతల వైఖరిని మాత్రమే తప్పుబట్టానని సమాధానం ఇచ్చారు.

నీట్​పై చర్చకు పట్టు.. ప్రతిపక్షాలు వాకౌట్

నీట్ పేపర్ లీక్​పై సెపరేట్​గా ఒకరోజంతా చర్చ పెట్టాలని రాహుల్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్ స్పందిస్తూ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో సభ ముగిసే వరకు నీట్​పై ప్రత్యేక చర్చ ఉండదని తేల్చి చెప్పారు. ఒక రోజు నీట్​పై చర్చ జరగాల్సిందే అని రాహుల్​పట్టుబట్టారు. 

రెండు కోట్ల మంది స్టూడెండ్ల జీవితాలకు సంబంధించిన విషయమని, చర్చకు ఒక రోజు కేటాయించలేరా? అని రాహుల్ ప్రశ్నించారు. ధన్యవాద తీర్మానం సభలో ఒక అంశంపై చర్చించకూడదన్న నిబంధన గురించి తాను ఇప్పుడే వింటున్నా అని విమర్శించారు. స్పీకర్ ఓం బిర్లా కూడా అభ్యంతరం తెలపడంతో సభ నుంచి ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.

అగ్నివీర్​తో జవాన్లను కూలీలను చేసిన్రు

అగ్నివీర్ స్కీమ్.. మోదీ ఆలోచన అని రాహుల్ విమర్శించారు. జవాన్లను కూలీలుగా మార్చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్నివీర్ స్కీమ్​ను రద్దు చేస్తామన్నారు. ప్రొఫెషనల్‌‌‌‌ పరీక్ష అయిన ‘నీట్‌‌‌‌’ను కమర్షియల్‌‌‌‌గా మార్చేశారని మండిపడ్డారు. ‘‘గతంలో తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. వారి కోసం కనీసం మౌనం కూడా పాటించలేదు. జమ్మూ కాశ్మీర్​ను రెండు ముక్కలు చేశారు. జీఎస్టీ తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. వ్యాపారులు, ప్రజలు ఎంతో బాధపడ్డారు. పెద్దనోట్లు రద్దు చేసి యువతకు ఉపాధి లేకుండా చేశారు. వీటితో దేశ ప్రజలకు కలిగిన లాభం ఏంటో చెప్పాలి. అల్లర్లతో మణిపూర్ అట్టుడుకుతున్నా.. ఇప్పటి వరకు మోదీ వెళ్లలేదు. నా కండ్ల ముందే బుల్లెట్ల వర్షం కురిసింది’’అని రాహుల్ అన్నారు.

రాహుల్ వర్సెస్ రాజ్​నాథ్

అగ్నివీర్ స్కీమ్​తో జవాన్లను ‘యూజ్ అండ్ థ్రో లేబర్’ చేశారని రాహుల్ అన్నారు. త్రివిధ దళాల ప్రతిష్టను దెబ్బతీశారని మండిపడ్డారు. ‘‘దేశం కోసం అగ్నివీర్ చనిపోతే అమరవీరుడని గుర్తించరు. అతన్ని అగ్నివీర్ అని మాత్రమే పిలుస్తారు. బాధిత కుటుంబానికి ఎలాంటి పరిహారం, పెన్షన్ ఇవ్వరు’’అని అన్నారు. దీనిపై రాజ్​నాథ్ సింగ్ స్పందిస్తూ...‘‘ఫాల్స్ స్టేట్​మెంట్లతో సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారు. యుద్ధంలో అగ్నివీర్ చనిపోతే అతని కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తామని స్కీమ్​లో చెప్పాం. ఎంతో మంది మేధావులు, 158 మంది ఆర్గనైజేషన్ల సలహాలతో అగ్నివీర్ స్కీమ్ తీసుకొచ్చాం’’అని కౌంటర్ ఇచ్చారు.

దేవుడు చెబితేనే పెద్ద నోట్లు రద్దు చేశారా?

‘‘నేను అసాధారణ వ్యక్తిని.. నాకు దేవుడితో డైరెక్ట్ కనెక్షన్ ఉంది” అంటూ మీడియాతో మోదీనే అన్నారు. పెద్దనోట్లు రద్దు చేయాలని దేవుడు చెప్తేనే.. ఈయన చేసినట్టు ఉన్నారు. ముంబై ఎయిర్​పోర్టు అదానీకి ఇచ్చెయ్ అని దేవుడు చెప్పిండేమో.. మోదీ ఇచ్చేసిండు. దేవుడి నుంచి ఏం మెసేజ్ వస్తే అది మోదీ వెంట వెంటనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయారు. పరమాత్మ.. డైరెక్ట్​గా మోదీ ఆత్మతో మాట్లాడుతుంది. మనమంతా సాధారణ మనుషులం. అందరి మాదిరి పుట్టి.. చనిపోయే జీవులం.
- రాహుల్​ గాంధీ