
- ట్రంప్ టారిఫ్లకు మోదీ విధానాలే కారణం
- దేశ ప్రయోజనాలు ఫస్ట్.. ఆ తర్వాతే మీ ఫ్రెండ్షిప్
- జీఎస్టీ సంస్కరణలతో పేదలకు ఒరిగేదేమీ లేదు
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంచి స్నేహితులే అయినప్పటికీ.. మోదీ మాత్రం దేశానికి శత్రువు అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇండియాపై అమెరికా విధించిన టారిఫ్లు, మోదీని ఉద్దేశిస్తూ ఖర్గే సంచలన కామెంట్లు చేశారు. ట్రంప్ 50% టారిఫ్ విధించడంతో భారత ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని విమర్శించారు. అయినప్పటికీ.. తన ఫ్రెండ్ అయిన ట్రంప్ గురించి మాత్రం మోదీ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదని మండిపడ్డారు.
కర్నాటకలోని కలబుర్గిలో రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ, ట్రంప్ స్నేహం అనేది.. ఇండియాకు శాపంగా మారింది. వీరిద్దరి ఫ్రెండ్షిప్ పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది. ట్రంప్ అమెరికా మేలు కోసం పనిచేస్తుంటే.. మోదీ మాత్రం దేశానికి శత్రువులా తయారయ్యారు. ఇక్కడి శాంతియుత వాతావరణాన్ని మోదీ నాశనం చేశారు. ట్రంప్ కామెంట్లు, చేష్టలు.. ఇండియాకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడ్తున్నాయి.
మోదీ జీ.. మీ ఐడియాలజీని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయకండి. ప్రధానిగా దేశ ప్రజలను కాపాడే బాధ్యత మీది. ముందు దేశ ప్రయోజనాలు.. ఆ తర్వాతే మీ ఫ్రెండ్షిప్ అని గుర్తు పెట్టుకోండి. విదేశాంగ విధానాలు కూడా బాగా లేవు. అమెరికాతో ఓపెన్ ఫ్రెండ్షిప్ చేసి మోదీ మన దేశాన్ని నష్టాల్లోకి తీసుకెళ్లారు’’ అని ఖర్గే మండిపడ్డారు.
మీ ఏకపక్ష నిర్ణయాలకు మా మద్దతు ఉండదు
పేదలకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ స్వాగతిస్తుంది, కానీ.. బీజేపీ అలాంటి నిర్ణయాలేవీ తీసుకోవడంలేదని ఖర్గే మండిపడ్డారు. 2 జీఎస్టీ స్లాబులు ఎత్తేసి కార్పొరేట్ కంపెనీలకే మేలు చేసిందని ఫైర్ అయ్యారు. ప్రజలకు ఎలాంటి లాభం లేదని తెలిపారు. ‘‘మోదీ జీ.. దేశం విషయానికొస్తే మనమంతా ఒక్కటే. ఎలాంటి డౌట్ లేదు. కానీ.. మేం మద్దతిస్తున్నామని మీరు ఏకపక్షంగా చేయాలనుకుంటే మాత్రం ఒప్పుకోం’’ అని ఖర్గే స్పష్టం చేశారు.
ఓట్ల చోరీ అంశమే మా ప్రధాన ఎజెండా
‘‘ట్రంప్ నా ఫ్రెండ్.. ఫిర్ ఏక్ బార్ ట్రంప్..’’అని మోదీ చేసిన నినాదాలే దేశ ప్రయోజనాలను దెబ్బతీశాయని ఖర్గే మండిపడ్డారు. ‘‘ఓట్ల చోరీ అంశమే మా ప్రధాన ఎజెండా. కర్నాటకలో బ్యాలెట్ పేపర్స్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యాం. దేశం మొత్తం ఇదే అమలయ్యేలా చూడాలి’’ అని ఖర్గే డిమాండ్ చేశారు.
నేడు కూటమి ఎంపీలకు డిన్నర్
ఉప రాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అపోజిషన్ పార్టీల ఎంపీలకు సోమవారం ఖర్గే నేతృత్వంలో మాక్ పోలింగ్ ఏర్పాటు చేశారు. సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లో మధ్యాహ్నం 2.30 గంటలకు మాక్ పోలింగ్ ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరికీ ఖర్గే డిన్నర్ ఇస్తున్నారు.