బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా పరాజయంతో ప్రారంభించింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 రన్స్‌కే ఆలౌట్ అయిన భారత్.. తన టెస్టు హిస్టరీలో అత్యంత తక్కువ స్కోరును నమోదు చేసింది. ఈ నేపథ్యంలో బాక్సింగ్ డే టెస్టులో పుంజుకొని ఆడాల్సి ఉంది. అయితే కెప్టెన్ కోహ్లీ గైర్హాజరీతోపాటు మహ్మద్ షమీ కూడా గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉండటంతో టీమిండియాకు కఠిన పరీక్ష ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షమీ స్థానంలో ఇషాంత్ శర్మ గనుక ఫిట్‌గా ఉంటే అతడ్ని తీసుకోవాలని వెటరన్ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ సూచించాడు.
‘ఒకవేళ గాయంతో షమీ దూరమైతే అది పెద్ద సమస్యే. వికెట్లు తీయడంలో అతడు సిద్ధహస్తుడు. బౌన్సర్లు, యార్కర్లతో అపోజిషన్ టీమ్‌ను షమీ షాక్‌కు గురి చేస్తాడు. అతడు ఆడకపోతే భారత్‌కు పెద్ద సమస్యే. ఇషాంత్ శర్మ ఫిట్‌గా ఉంటే అతడ్ని ఆస్ట్రేలియాకు పంపితే బాగుంటుంది. ఒకరోజులో 20 ఓవర్లు వేసే సత్తా ఉంటే ఇషాంత్‌ను ఆసీస్‌కు రేపే ఫ్లయిట్‌లో పంపాలి. దీంతో సిడ్నీ టెస్టుకు అతడు సిద్ధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సరైన బ్యాకప్ లేని కారణంగా భారత్ సాహసం చేయాల్సిందే. నవ్‌దీప్ సైనీకి వికెట్లు తీసే సత్తా ఉంది. కానీ వార్మప్ మ్యాచుల్లో సైనీ బౌలింగ్ చేసిన తీరును చూస్తే ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను అతడు ఇబ్బంది పెట్టగలడని అనిపించట్లేదు’ అని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

