బుమ్రా ప్లేస్లో మహ్మద్ షమీ

బుమ్రా ప్లేస్లో మహ్మద్ షమీ

మహ్మద్ షమీ జాక్ పాట్ కొట్టేశాడు. బుమ్రా ప్లేస్ లో టీ20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది.  వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 15 తుది గడువు కావడంతో..బుమ్రా స్థానంలో షమీ పేరును బీసీసీఐ ఐసీసీకి ప్రతిపాదించింది. 

బ్యాకప్ ప్లేయర్గా ఎంపిక
టీ20 వరల్డ్ కప్ కోసం బుమ్రా ఎంపికవ్వగా..షమీని బ్యాకప్ ప్లేయర్గా బీసీసీఐ ప్రకటించింది. అయితే వెన్ను నొప్పి కారణంగా బుమ్రా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నాడు. అయితే షమీ బ్యాకప్ ప్లేయర్ గా ఉన్నా..అతను కరోనా బారిన పడటంతో..ఫిట్ నెస్ పై సందేహాలు నెలకొన్నాయి. అయితే జాతీయక్రికెట్ అకాడమీలో షమీకి ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో షమీ పాసవ్వడంతో..బీసీసీఐ అతన్నే ఎంపిక చేసింది. 

సిరాజ్కు నిరాశ
షమీ కరోనా బారిన పడటంతో..సౌతాఫ్రికా సిరీస్ కు హైదరాబాద్ పేసర్ సిరాజ్ ఎంపికయ్యాడు. వన్డే సిరీస్ లో అతను అద్భుతంగా రాణించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా అందుకున్నాడు. దీంతో సిరాజ్ కు బుమ్రా స్థానంలో  టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని  అంతా భావించారు.  కానీ షమీ ఫిట్‌నెస్ సాధించడంతో సిరాజ్‌కు మొండి చెయి ఎదురైంది. అటు వెన్ను గాయంతో దూరమైన రిజర్వ్ ప్లేయర్ దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ ఎంపికయ్యాడు. 

ఐపీఎల్లో సూపర్ ప్రదర్శన
2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత షమీ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన అతను..టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.

టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా,  పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, షమీ
స్టాండ్‌బై ప్లేయర్స్:  సిరాజ్, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్