
తెలుగు సినీ రంగంలో తనదైన నటనతో చెరగని ముద్ర వేసిన దిగ్గజ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao ) . ఆయన మృతి సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వీలక్షణ నటుడి మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని సోమవారం ( జూలై 21, 2025 ) నటుడు మంచు మోహన్ బాబు ( Mohan Babu ) పరామర్శించారు. జూబ్లీహిల్స్ లోని కోట ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కోట శ్రీనివాసరావు మరణం తన కుటుంబానికే కాకుండా, తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
కోటా శ్రీనివాసరావు మరణం రోజూ తాను హైదరాబాద్ లో లేనని మోహన్ బాబు తెలిపారు. ఆయన మరణం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. తన కుమారుడు విష్ణు నటించిన తాజా చిత్రం 'కన్నప్ప' విడుదల రోజున కోట శ్రీనివాసరావు ఫోన్ చేశారని గుర్తు చేసుకున్నారు. "కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని, విష్ణుకు మంచి పేరు వచ్చిందని అందరూ అంటుంటే విన్నాను అని నాతో ఫోన్‌లో చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. అదే కోటతో నా చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు అని అన్నారు.
కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు అని మోహన్ బాబు అన్నారు. 1987 సంవత్సరంలో 'వీరప్రతాప్' సినిమాలో మాంత్రికుడిగా మెయిన్ విలన్‌గా నా బ్యానర్‌లో నటించారు. నా సంస్థలోనే కాకుండా బయటి నిర్మాణ సంస్థల్లో కూడా మేమిద్దరం ఎన్నో సినిమాలు కలిసి చేశాం అని నాటి రోజులను నెమరువేసుకున్నారు. కోట శ్రీనివాసరావు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల గొప్ప నటుడని మోహన్‌బాబు కొనియాడారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న పాత్రలు పోషించి, ప్రతి పాత్రకూ వైవిధ్యాన్ని చూపించేవారని ప్రశంసించారు. ఎలాంటి డైలాగ్ అయినా అలవోకగా, డిఫరెంట్ మాడ్యులేషన్స్‌లో చెప్పగలిగే ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు అని గుర్తు చేసుకున్నారు. కోట తో కలిసి మోహన్‌బాబు 'పెదరాయుడు', 'రాయలసీమ రామన్న చౌదరి', 'యమదొంగ' వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.