
సికింద్రాబాద్, వెలుగు: పెళ్లి పేరుతో మహిళలను నమ్మించి అందిన కాడికి దోచుకుని ఉడాయించే పాత నేరస్తుడిని మోండా మార్కెట్పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 27 తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, బ్యాంకు పాస్‌బుక్, క్రెడిట్‌కార్డును స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు. గురువారం మహంకాళి ఏసీపీ రవీందర్ మీడియాకు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన తుమ్మ మోహన్‌రెడ్డి అలియాస్శ్రీనాథ్(38) పాత నేరస్తుడు. పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 2011లో మోహన్‌రెడ్డి సొంతూరికి చెందిన యువతిని పెళ్లి చేసుకుని కల్వకుర్తికి వెళ్లాడు.
ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో అరెస్టై జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చాక డబ్బులు ఈజీగా సంపాదించాలనే దురాశతో పెళ్లి పేరుతో మహిళలను మోసగించేందుకు పాన్ల్వేశాడు. ముందుగా కందుకూరులో మోహన్‌రెడ్డి బంధువు కారును దొంగిలించి రూ.4.5లక్షలకు అమ్మేశాడు. సిటీకి వచ్చి వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ.. రూమ్‌మేట్స్‌కు చెందిన ఎలక్ర్టానిక్ వస్తువులు దొంగిలించి అమ్మకునేవాడు. అనంతరం బెంగళూరు వెళ్లి షాదీ డాట్కామ్వెబ్సైట్లో వివరాలు నమోదు చేశాడు. ఓ మహిళతో ఫ్రెండ్ షిప్ చేసి నమ్మించి క్రెడిట్‌కార్డు తీసుకుని రూ.2.2లక్షలతో బంగారు ఆభరణాలు కొని విజయవాడకు పారిపోయి అమ్మాడు.
అక్కడ గౌతమ్రెడ్డిపేరుతో ఒక ఫేక్ ఐడీ సృష్టించి షాదీ డాట్కామ్వెబ్సైట్లో పెళ్లి కోసం వివరాలు పెట్టాడు. మియాపూర్‌కు చెందిన ఓ యువతితో చాటింగ్చేయగా, హైదరాబాద్‌కు వచ్చి రెండుసార్లు కలిశాడు. నమ్మించి ఆమె వద్ద క్రెడిట్‌కార్డును తీసుకుని రూ.6,21,483ల విలువైన బంగారు నగలు కొన్నాడు. తిరిగి విజయవాడకు వెళ్లి నగలను అమ్మాడు. 2023లో రెడ్డి మ్యాట్రిమోనీ డాట్కామ్వెబ్సైట్ లో తిరుమల విజయ్‌రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి గుంటూరుకు చెందిన ఓ అమ్మాయి నుంచి రూ.9లక్షలు కాజేశాడు. ఆ తర్వాత భారత్‌మ్యాట్రిమోనీ డాట్‌కామ్‌లో ఒక ఫేక్ఐడీ సృష్టించి శ్రీనాథ్ పేరుతో వివరాలు పోస్ట్ చేశాడు.
ఓ అమ్మాయి పెళ్లి చేసుకునేందుకు అంగీకారం తెలిపింది. దీంతో మోహన్‌రెడ్డి ఈనెల18న సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జికి ఆమెను పిలిచాడు. ఆమె వాష్ రూమ్‌కు వెళ్లిన టైమ్‌లో మోహన్‌రెడ్డి ఆమె బ్యాగులోని 27 తులాల బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.