
- మూడోసారి వరల్డ్ చాంపియన్‌షిప్ సొంతం
టోక్యో: అమెరికా స్టార్ అథ్లెట్ అర్మాండ్ మోండో డుప్లాంటిస్.. పోల్‌వాల్ట్‌లో 14వ సారి వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన మెన్స్ పోల్ వాల్ట్ ఫైనల్లో డుప్లాంటిస్ 6.30 మీటర్ల ఎత్తు క్లియర్ చేసి మూడోసారి చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించాడు. లూసియానాలో పెరిగిన డుప్లాంటిస్‌కు ఒలింపిక్స్‌తో సహా ఇది వరుసగా 49వ మీట్, ఐదో టైటిల్ కావడం విశేషం. మూడో ప్రయత్నంలో ఈ దూరాన్ని అందుకునే క్రమంలో బార్ ఊగిసలాడినా కిందపడిపోలేదు. మ్యాట్‌పై పడిన తర్వాత లేచి రెండో ప్లేస్‌లో నిలిచి ఎమ్మానౌయిల్ కరాలిస్‌తో చేతులు కలిపి ముందుకు సాగాడు. ఈ విజయానికి డుప్లాంటిస్‌కు 70 వేల డాలర్లతో పాటు రికార్డును బ్రేక్ చేసినందుకు అదనంగా లక్ష డాలర్ల బోనస్ అందుకుంటాడు. 25 ఏండ్ల డుప్లాంటిస్ 2020 ఫిబ్రవరి 8న తొలిసారి 6.17 మీటర్ల ఎత్తు పైనుంచి దూకి 2012 ఒలింపిక్ చాంపియన్ రెనాడ్ లావిల్లెనీ (ఫ్రాన్స్) పేరు మీద ఉన్న వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అప్పట్నించి ఒక్కో సెంటీ మీటర్ పెంచుకుంటూ వస్తున్నాడు.
శంకర్, పారుల్‌కు నిరాశ
ఈ మీట్‌లో ఇండియన్ అథ్లెట్ల చెత్తాట కొనసాగుతోంది. మెన్స్ లాంగ్ జంప్ గ్రూప్–ఎ క్వాలిఫికేషన్స్‌లో మురళీ శ్రీశంకర్ 7.78 మీటర్ల దూరం దూకి 14వ ప్లేస్‌లో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. మూడోసారి ఈ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న శ్రీశంకర్ 37 మంది పాల్గొన్న క్వాలిఫికేషన్స్‌లో ఓవరాల్‌గా 25వ స్థానంలో నిలిచాడు. అటోమెటిక్ క్వాలిఫయింగ్ మార్క్ 8.15 మీటర్ల దూరం దూకిన బెస్ట్ 12 మంది ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. 2022 ఎడిషన్‌లో ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన శ్రీశంకర్.. ఏడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. విమెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్ హీట్స్‌లో పారుల్ చౌదరి (9ని,22.24 సెకన్లు), అంకిత దయాని (10ని,03.22 సెకన్లు) వరుసగా 9, 11వ ర్యాంక్‌ల్లో నిలిచారు. మూడు హీట్స్ ముగిసిన తర్వాత ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో పారుల్ 20, అంకిత 35వ స్థానాలను సాధించారు. మెన్స్ 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ షిర్స్ 13.57 సెకన్ల టైమింగ్‌తో 29వ ప్లేస్‌లో నిలిచాడు.