బషీర్బాగ్, వెలుగు: సైబర్ చీటర్స్ ఇద్దరిని చీట్ చేసి కొట్టేసిన రూ.6 లక్షలను సైబర్ క్రైం పోలీసులు రిటర్న్ వచ్చేలా చేశారు. బాధితులు సకాంలో ఫిర్యాదు చేయడంతో వేగంగా స్పందించిన పోలీసులు ఆ డబ్బులు ఫ్రీజ్ చేసి వెనక్కి వచ్చేలా కృషి చేశారు. వివరాల్లోకెలితే.. గురువారం యూసఫ్ గూడ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఎం పరివాహన్ పేరిట ఏపీకే ఫైల్ ను స్కామర్స్ పంపించారు. అతని వాహనంపై పెండింగ్ చలాన్ ఉన్నట్లు నమ్మించారు. దానిని క్లిక్ చేయగానే బాధితుడి ఫోన్ హ్యాక్ అయి, అతని క్రెడిట్ కార్డు నుంచి రూ.5,23,125 డెబిట్ అయ్యాయి. బాధితుడు వెంటనే 1930కి కాల్ చేసి , నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు.
సైబర్ క్రైం కానిస్టేబుల్ ప్రియాంక వెంటనే స్పందించి ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ పే అధికారులను సమన్వయం చేసి ఆ డబ్బులను ఫ్రీజ్ చేయించారు. తిరిగి ఆ డబ్బులు మొత్తం బాధితుడి క్రెడిట్ కార్డులో జమ అయ్యాయి. మరో కేసులో అంబర్ పేటకు చెందిన 53 ఏళ్ల బాధితుడికి ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు అప్డేట్ అంటూ ఏపీకే ఫైల్ పంపించారు. దానిని ఇన్స్టాల్ చేయడంతో తన ఖాతాలో ఉన్న రూ.1,25,822 మాయమయ్యాయి.
బాధితుడు బషీర్ బాగ్ లోని సైబర్ క్రైమ్ స్టేషన్ లో గంటలోపు ఫిర్యాదు చేశాడు. కానిస్టేబుళ్లు ఎన్.శ్రీకాంత్ నాయక్ , ఎండీ.జావేద్ నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా సాయం చేశారు. ఫ్లిప్ కార్ట్, మొబి క్విక్ యాప్స్ తో సమన్వయం చేసి పోగొట్టుకున్న డబ్బులు బాధితుడికి వచ్చేలా చేశారు. సైబర్ నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేస్తే రికవరీ చేయడం సాధ్యమవుతుందని సైబర్ క్రైం ఏసీపీ శివ మారుతి తెలిపారు.

