బెడ్‌పై కూర్చొని, ఫోన్‌లో వీడియోలు స్క్రోల్ చేస్తోన్న కోతి

బెడ్‌పై కూర్చొని, ఫోన్‌లో వీడియోలు స్క్రోల్ చేస్తోన్న కోతి

జంతువులు, మనుషులతో సంభాషించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. సాంకేతికతను ఉపయోగించడంతో సహా అన్ని రకాల పనులను చేసే జంతువుల వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా సైట్లలో చూసే ఉంటాం. జంతువులు మానవ ప్రపంచానికి ఎలా అనుకూలంగా మారుతున్నాయి అన్న దానికి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోనే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇటీవల షేర్ చేసిన ఓ వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది. ఓ ఒక పెంపుడు కోతి దుస్తులు ధరించి, ఒక మహిళతో మంచం మీద కూర్చొని, స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలను స్క్రోల్ చేస్తూ ఉండడం అందరకీ ఆశ్చర్యంతో పాటు, ఫన్నీగానూ అనిపిస్తోంది. నిజానికి ఈ వీడియోని CanvasM సీఈఓ జగదీష్ మిత్రా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో ఈ క్లిప్‌ను పంచుకున్నారు. దీంతో ఈ వీడియోకు ఇప్పటివరకు 3లక్షలకు పైగా వ్యూస్, దాదాపు11వేల లైక్‌లు వచ్చాయి.

ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో కోతి ప్రవర్తన చూసేందుకు సరదాగా  ఉంది. దీంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో వినోదభరితంగా ఉందని కొందరు, జంతువులపై సాంకేతికత ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మరికొందరు కామెంట్ చేస్తు్న్నారు, "మనుషులు ఓడిపోయారు... జంతువులను డిజిటల్ అనే డ్రగ్ కు దూరంగా ఉంచండి" అని మరికొందరు అంటుండగా..  ప్రపంచం నాశనం అవుతుందంటూ ఇంకొకరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.