నిర్మల్ జిల్లా ధర్మారం గ్రామంలో కోతి దేవుడు జాతరకు వేళాయే..

నిర్మల్ జిల్లా ధర్మారం గ్రామంలో  కోతి దేవుడు జాతరకు వేళాయే..
  • నేడు రథోత్సవం
  • రేపు జాతర, అన్నదానం

లక్ష్మణచాంద, వెలుగు : కోరిన కోరికలు తీర్చే కోతి దేవుడి జాతరకు సర్వం సిద్ధం అయింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం ధర్మారం గ్రామంలో వెలసిన కోతి దేవుడి జాతర నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనుంది. శుక్రవారం స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతోపాటు రథోత్సవం నిర్వహిస్తారు. శనివారం స్వామివారికి ప్రత్యేక పూజతోపాటు భారీ ఎత్తున జాతర, మహా అన్నదానం కార్యక్రమాన్ని  చేపట్టనున్నారు. ఈ కోతి దేవుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి వంటి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు..

కోతి దేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, అన్నదానం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.